
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ తాజాగా హెల్త్‌కేర్‌కి సంబంధించి కొత్త ఫండ్ ఆఫర్‌ను ఆరంభించింది. నవంబర్ 12న ప్రారంభమైన ఈ ఫండ్ ఆఫర్ వ్యవధి నవంబర్ 26 దాకా ఉంటుంది. ఈ ఫండ్ సుమారు రూ.500 కోట్ల దాకా పెట్టుబడులు (ఏయూఎం) సమీకరించే అవకాశం ఉందని ఫండ్ మేనేజర్ ఆదిత్య ఖేమ్కా తెలిపారు.
ఈ ఫండ్ సుమారు 20–25 హెల్త్‌కేర్, ఫార్మా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుందన్నారు. ‘‘లార్జ్‌క్యాప్ కన్నా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాం. ఈ షేర్లు ఇప్పటికే గణనీయంగా క్షీణించి ఆకర్షణీయమైన రేటుకు లభిస్తుండటమే దీనికి కారణం. ఇవైతే భవిష్యత్‌లో మెరుగైన రాబడులు అందించగలవు’’ అని ఖేమ్కా వివరించారు.
ఫండ్‌లో సుమారు పాతిక శాతాన్ని అటు అంతర్జాతీయంగా అమెరికన్ మార్కెట్లో కూడా హెల్త్‌కేర్, ఫార్మా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయనుండటం ఈ ఫండ్ ప్రత్యేకతగా ఆదిత్య వివరించారు. డాలర్, రూపాయి మారకంలో వ్యత్యాసాల కారణంగా కరెన్సీపరమైన ప్రయోజనాలు కూడా చేకూరగలవన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాలు, పెరుగుతున్న జనాభా అవసరాలు దేశీయంగా ఫార్మా, హెల్త్‌కేర్ సంస్థలకు సానుకూలంగా ఉండగలవని తెలిపారు.
ఆటుపోట్లు కొనసాగవచ్చు ..
సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో రాబోయే ఆరు నెలలు మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగవచ్చని ఆదిత్య వివరించారు. ఫార్మా రంగంలో తీవ్ర పోటీ వల్ల ధరల పరమైన ఒత్తిళ్లు, నియంత్రణ సంస్థల నిబంధనలు తదితర సవాళ్లు ఉండొచ్చని పేర్కొన్నారు. రూపాయి పతనం ప్రయోజనాల ప్రభావం .. కంపెనీల ఖాతాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఆఖర్లో కనిపించవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment