న్యూఢిల్లీ: సాధారణంగా ఏటా దీపావళి సమయంలో బంగారం మార్కెట్ కొనుగోళ్లతో సందడిగా ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం ఈ వెలుగులు ఉండకపోవచ్చని ప్రపంచ స్వర్ణమండలి(డబ్ల్యూజీసీ) భారత విభాగం మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ సోమసుందరం తెలిపారు. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు, మనీలాండరింగ్ నిరోధక నిబంధనలు అమల్లోకి రావడం తదితర అంశాలను కారణాలుగా ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ దీపావళి సీజన్‌లో ఎన్నో సవాళ్లున్నాయి. అన్నీ సర్దుకుంటాయనే ఆశావాదంతో ఉన్నాను.
అయితే, యాంటీ మనీలాండరింగ్ నిబంధనలు ఈ తరుణంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ధన్‌తేరస్ కొనుగోళ్ల కంటే వివాహ కొనుగోళ్లపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చు’’ అని సోమసుందరం చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు బంగారం దిగమతులు 532 టన్నులుగా ఉండగా, డిమాండ్ మాత్రం 298 టన్నులేనని తెలిపారు. జీఎస్‌టీకి ముందు బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకున్నారని, కానీ, ఆ మేరకు డిమాండ్ లేదన్నారు.
70 శాతం వ్యాపారం అవ్యవస్థీకృత రంగంలోనే ఉన్నందున జీఎస్‌టీ అమల్లోకి వచ్చినతర్వాత పరిస్థితులు సర్దుకోవడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని చెప్పారు. జీఎస్‌టీ రాకతో వినియోగదారుల ఆలోచనలో మార్పు వచ్చిందని, అధిక పన్నులతో బంగారం డిమాండ్ తగ్గుతుందని చారిత్రక గణాంకాలను చూస్తే తెలుస్తోందన్నారు.