విలేకరుల సమావేశంలో హుక్ ఎండీ సలిల్ కపూర్, యాక్ట్ ఫైబర్‌నెట్ సీవోవో(హైదరాబాద్ విభాగం) సౌరభ్
హైదరాబాద్ మార్కెట్లో
వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (వీవోడీ) సేవల సంస్థ హుక్ తాజాగా హైదరాబాద్ మార్కెట్‌కు సంబంధించి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్‌నెట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద యాక్ట్ ఖాతాదారులు ఒక నెల రోజుల పాటు ఉచితంగా హుక్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని హుక్ భారత విభాగం ఎండీ సలిల్ కపూర్ బుధవారమిక్కడ విలేకరులకు తెలిపారు. తమ వద్ద పదివేల పైచిలుకు హాలీవుడ్, బాలీవుడ్, ప్రాంతీయ భాషా సినిమాలతో పాటు ది బిగ్ బ్యాంగ్ థియరీ, గోథమ్ తదితర సీరియల్స్, టీవీ షోలూ అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.
ప్రస్తుతం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో వీడియో, ఆడియో కంటెంట్ వాటా సుమారు 30 శాతంగా ఉండగా.. 2018 నాటికి ఇది 89 శాతానికి చేరగలదన్న అంచనాలున్నట్లు సలిల్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ఉన్న హైదరాబాద్‌తో ప్రారంభించి యాక్ట్‌తో భాగస్వామ్యాన్ని త్వరలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి కూడా విస్తరించనున్నట్లు సలిల్ కపూర్ చెప్పారు.
నెలకు రూ. 249 అద్దెతో 5 కనెక్టెడ్ డివైజ్‌లపై సినిమాలు, సీరియల్స్ మొదలైనవి వీక్షించవచ్చని ఆయన చెప్పారు. అఫ్‌లైన్ డౌన్‌లోడ్ సదుపాయం కూడా ఉందన్నారు. మరోవైపు, హుక్‌తో భాగస్వామ్యాన్ని స్వాగతించిన యాక్ట్ గ్రూప్ సీఈవో బాల మల్లాది .. మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు అత్యుత్తమ కంటెంట్‌ను తమ కస్టమర్లకు అందించేందుకు ఇటువంటివి దోహదపడగలవని తెలిపారు.