మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా? | How to choose a mutual fund? | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?

Published Mon, Oct 30 2017 3:35 AM | Last Updated on Mon, Oct 30 2017 3:35 AM

How to choose a mutual fund?

మార్కెట్లో వందలాది మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి.  ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలో తెలియడం లేదు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఏ తరహా ఫండ్‌ను ఎందుకు ఎంచుకోవాలో వివరించండి ?    –భరత్, విశాఖపట్టణం  

భారత్‌లో దాదాపు 4 వేలకు పైగా మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లున్నాయి. వీటిల్లో చాలా ఫండ్స్‌ స్కీమ్‌ల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనే అంశం ముఖ్యంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ఇన్వెస్ట్‌ చేసే వ్యక్తికి సంబంధించింది. వివిధ రకాలైన ఇన్వెస్టర్ల కోసం పలు రకాల ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అధిక రిస్క్‌ భరించేవారికి హై గ్రోత్‌–హై రిస్క్‌ ఈక్విటీ ఫండ్స్‌ ఉండగా, రిస్క్‌ తక్కువతీసుకోవాలనుకున్నవారు డెట్‌ ఫండ్స్‌ ఎంచుకోవచ్చు.

ఇక రెండవది ఇన్వెస్ట్‌ చేసే సమయం... మీరు ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తారనేది మరో ముఖ్య విషయం. ఐదేళ్లు అంతకు మించి ఇన్వెస్ట్‌ చేసేవారికి ఈక్విటీ ఫండ్స్‌ సబబుగా ఉంటాయి. స్వల్పకాలం ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారికి డెట్‌ ఫండ్స్‌ సరైనవి.  ఇక మూడో ముఖ్యమైన అంశం ఏ తరహా ఫండ్‌ను ఎంచుకోవాలి అనేది. మీరు ఎంచుకునే ఫండ్‌ లార్జ్, లేదా స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుందా ?భారత లేదా విదేశీ కంపెనీల్లో మదుపు చేస్తుందా? అనే విషయం పరిశీలించాలి.

ఈ మూడు ముఖ్యమైన విషయాలే కాకుండా మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న ఫండ్‌కు మేనేజర్‌గా వ్యవహరించే వ్యక్తి ఎంత కాలం నుంచి ఆ ఫండ్‌ను నిర్వహిస్తున్నారు? పోటీ ఫండ్స్‌తో పోల్చితే మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న ఫండ్‌ పనితీరు ఎలా ఉంది ? మీరు పన్ను పరిధిలోకి వస్తారా ? వస్తే ఏ ట్యాక్స్‌ బ్రాకెట్‌లో ఉంటారు ? మీ  ఇతర ఇన్వెస్ట్‌మెంట్స్, మీ సంపాదన, మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
 
నేను కొంత మొత్తాన్ని 15–20 ఏళ్ల తర్వాత నా కానుకగా నా కూతురికి ఇవ్వాలనుకుంటున్నాను. నిలకడగా, మంచి పనితీరు కనబరిచే ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఆ మొత్తాన్ని ఇవ్వాలనేది నా ఆలోచన. నా ఆలోచనకు అనుగుణమైన ఒక ఫండ్‌ను సూచించండి.   –రాధిక, విజయవాడ  

మీరు దీర్ఘకాలం పాటు అంటే 15–20 ఏళ్ల తర్వాత కొంత మొత్తాన్ని బహుమతిగా మీ కూతురికి ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మీరు ఇన్వెస్ట్‌ చేసే ఫండ్‌ పనితీరు ఎలా ఉంటుందోనని  మీరు  నిరంతరం గమనించాల్సిన అవసరం  ఉండకూడదు.

మార్కెట్‌ పెరుగుతున్నప్పుడైనా, లేదా మార్కెట్‌ పడిపోతున్నప్పుడైనా, లేదా పరిమిత శ్రేణిలో కదలాడుతున్నçప్పుడైనా, నిలకడగా వృద్ధి చెందే ఫండ్‌ మీకు అవసరం. ఇలాంటి అంశాలన్నింటి దృష్ట్యా మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి ఎంచుకోవడానికి మూడు ఫండ్స్‌ సూచిస్తున్నాం... ఐసీఐసీఐ డైనమిక్‌ ఈక్విటీ ఫండ్, క్వాంటమ్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్, పరాగ్‌ పరేఖ్‌ లాంగ్‌ టర్మ్‌ఈక్విటీ ఫండ్‌.. ఈ మూడు ఫండ్స్‌లో మీరు ఏదైనా ఒక ఫండ్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్‌  చేయవచ్చు.  

నా వయస్సు 52 సంవత్సరాలు. నా పీపీఎఫ్‌ ఖాతాలో రూ.20 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం త్వరలో మెచ్యూర్‌ కాబోతోంది. ప్రస్తుతానికైతే నాకు ఈ డబ్బులు అవసరం లేదు. ఈ మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? నాకు తగిన సూచనలివ్వండి.  
–హుస్సేన్,  హైదరాబాద్‌

మీరు నిరభ్యంతరంగా ఈ మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టవచ్చు. అసలు పీపీఎఫ్‌లో కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మీకు మరింతగా రాబడులు వచ్చి ఉండేవి. పీపీఎఫ్‌ వడ్డీరేట్లు భవిష్యత్తులో మరింతగా తగ్గవచ్చు. పీపీఎఫ్‌ డబ్బులు మీకు మరో ఐదు, అంతకు మించిన కాలానికి అవసరం లేకపోతే, ఈ డబ్బులను స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. స్వల్పకాలంలో ఒకింత ఒడిదుడుకులున్నా, స్టాక్‌ మార్కెట్‌ నుంచి మీకు దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందుతారు.

స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన లేకున్నా, రిస్క్‌ అని మీరు భావించినా, ఈ సొమ్ములను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయ వచ్చు. ఏదైనా 1–2 రెండు బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి. మీ పీపీఎఫ్‌ మొత్తాన్ని మూడేళ్ల కాలంలో నెలకు ఇంత చొప్పున ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి రాబడులు రావడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు.

ఊరిలో పొలం అమ్మగా పెద్ద మొత్తమే నా చేతికొచ్చింది.  ఈ మొత్తాన్ని హైబ్రిడ్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌(ఎస్‌టీపీ) ద్వారా ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఎంత కాలంలో ఎస్‌టీపీ ద్వారా హైబ్రిడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి?   –రమేశ్, కరీంనగర్‌  

ఎస్‌టీపీ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేయాలనే విషయానికి సా«ధారణæ సూత్రాలేమీ లేవు. చిన్న మొత్తాలైతే తక్కువ కాలం తీసుకోవాలి. భారీ మొత్తాలైతే దీర్ఘకాలం  ఎస్‌టీపీ ద్వారా ఇన్వెస్ట్‌ చేయాలి. ఇక్కడ దీర్ఘకాలం అంటే గరిష్టంగా మూడేళ్లు అని అర్థం చేసుకోవాలి. మూడేళ్లు ఎందుకంటే, మార్కెట్‌ సైకిల్‌ సాధారణంగా మూడేళ్లు ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రయోజనాలు పొందవచ్చు.

మూడేళ్లకు మించి ఎస్‌టీపీ ద్వారా ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే.. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగిన రాబడులు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనం ఇన్వెస్ట్‌చేసే మొత్తాన్ని బట్టే  ఎస్‌టీపీ కాలాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు ఏడాదికొకసారి బోనస్‌ వస్తుందనుకుందాం. ఈ బోనస్‌ను మూడు నుంచి ఆరు నెలల కాలంలో ఎస్‌టీపీ ద్వారా ఇన్వెస్ట్‌ చేయాలి. ఇక ఎంత పెద్ద మొత్తమైనా మూడేళ్లకు మించి ఎస్‌టీపీ ద్వారా ఇన్వెస్ట్‌ చేయకుండా ఉండడమే ఉత్తమం.   


– ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement