మేలో ‘తయారీ’భేష్: హెచ్‌ఎస్‌బీసీ
న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పనితీరును కనబరచిందని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ ఏప్రిల్‌లో 51.3 పాయింట్ల వద్ద ఉంటే.. మేలో 52.6కు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. దేశీయ డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణమని కూడా హెచ్‌ఎస్‌బీసీ వివరించింది. ముడి వస్తువుల ధరలు తీవ్రంగానే ఉన్నాయని, ఉపాధి కల్పన విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని నివేదిక పేర్కొంటూ... అయినా దేశీయ డిమాండ్ పటిష్టతతో తయారీ రంగం మేలో కొంత మెరుగుపడినట్లు తెలిపింది.
హెచ్‌ఎస్‌బీసీ సూచీ కూర్పు ప్రకారం... ఇది 50 పాయింట్ల పైన ఉంటే.. సంబంధిత రంగం వృద్ధిలో ఉన్నట్లే భావించడం జరుగుతుంది. దిగువన ఉంటే దానిని క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన తయారీ రంగం వరుసగా 19 నెలల నుంచీ వృద్ధి స్థాయిలోనే కొనసాగుతోంది.