శామ్ సంగ్ పై పేటెంట్ దావా..!
రెండు ఆసియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజాల మధ్య న్యాయపోరాటం తీవ్రతరమవుతోంది. హ్యువాయ్ సంస్థ తన స్మార్ట్ ఫోన్ ప్రత్యర్థి శామ్ సంగ్ పై చైనాలో మరో పేటెంట్ దావాను ఫైల్ చేసింది. 16 శామ్ సంగ్ ఉత్పత్తులు హ్యువాయ్ పేటెంట్ హక్కులను అతిక్రమించాయని ఆరోపణలు చేస్తూ ఈ దావాను నమోదుచేసింది. ఈ హక్కుల ఉల్లంఘనల కింద 120 లక్షల డాలర్ల (దాదాపు రూ. 90 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొబైల్ టెర్మినల్, డిస్ ప్లే కు సంబంధించిన విధానాలను శామ్ సంగ్ ఉల్లంఘించిందని హ్యువాయ్ ఆరోపిస్తోంది. వీటిని శామ్ సంగ్ గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, గెలాక్సీ జే5 లలో ఉపయోగించిందని హ్యువాయ్ ఈ దావాలో పేర్కొంది. ఈ మోడల్స్ ను శామ్ సంగ్ హ్యుజూ, త్యాన్జిన్ కర్మాగారాల్లో రూపొందించినట్టు హ్యువాయ్ ఆరోపిస్తోంది.
ఈ కేసును కోర్టు ఆమోదించిందని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ ఫిర్యాదును కంపెనీ పూర్తిగా విశ్లేషించిన తర్వాతే తన ప్రయోజనాలు రక్షించుకునేందుకు తగిన చర్యలు చేపడతామని శామ్ సంగ్ చెప్పింది. హ్యువాయ్ అధికార ప్రతినిధులు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.
మే నెలలోనే శామ్ సంగ్ పై అమెరికా, చైనాల్లో హ్యువాయ్ దావా వేసింది. నాలుగో తరం సెల్యులార్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, యూజర్ ఇంటర్ ఫేస్ సాప్ట్ వేర్ ను శామ్ సంగ్ ఫోన్లలో ఎలాంటి లైసెన్సులు లేకుండా వాడిందని ఆ దావాను ఫైల్ చేసింది. దానికి నష్టపరిహారాన్ని కూడా ఆ కంపెనీ కోరింది.