రూపాయ నోటా అని చులకనగా మాట్లాడుతున్నారా? కాసేపు ఆగండి.. అలా చులకనగా మాట్లాడే ఈ నోటుకే, పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా ఏర్పడిది. నేటితో ఈ నోటు వందేళ్లను పూర్తిచేసుకుంది. 1917 నవంబర్ 30న ప్రవేశపెట్టిన ఈ రూపాయి నోటుకు, 2017 నవంబర్ 30తో వందేళ్లు నిండాయి. తొలిసారి ఈ నోటును కింగ్ జార్జ్ వీ ఫోటోతో ఇంగ్లాండ్ దేశం భారత్‌లో ప్రవేశపెట్టింది. నాటి నుంచి వర్తకులు ఈ నోటునే తమ అవసరాలకు విరివిగా వినియోగించారు. అనంతరం 1935 ఏప్రిల్ 1వ తేదీన రూపాయి నోటు ముద్రణకు అనుమతిని భారత రిజర్వ్ బ్యాంక్‌కు ఆంగ్లేయులు అప్పగించారని తెలిసింది. 1861 నుంచే కరెన్సీ నోట్ల జారీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపడుతున్నప్పటికీ, 1917లోనే రూపాయి నోటును ప్రవేశపెట్టారు.
ప్రపంచ యుద్ధం-1లో ఆయుధాలను తయారుచేసేందుకు రూ.1 కాయిన్లను వాడటంతో, ఈ నోటు ప్రవేశం జరిగింది. 1917లో లాంచ్ చేసిన ఈ నోటు, 10.7 గ్రాముల వెండికి సమానంగా ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.390గా ఉంది. అంటే రూపాయి నోటు విలువ దాదాపు 400 వంతు తగ్గిపోయింది. 1994లో నిలిపివేసిన రూపాయి నోటు 2015 మార్చి 6వ తేదీ పునఃదర్శన మిచ్చిందన్నారు. రూపాయి నోటు ముద్రించేందుకు రూ.1.14 ఖర్చవుతున్నట్టు సమాచార హక్కుచట్టంలో వెల్లడైంది.
దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి పర్యవేక్షణలో ముద్రించిన రూపాయి నోటు ఎక్కువగా ప్రజాదరణ పొందింది. 1949లో ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్‌కే మీనన్ సంతకం చేసిన నోటుపై మొట్టమొదటిగా అశోకుడి స్తూపం ముద్రించారు. 1951లో హిందీలో ముద్రించిన రూపాయి నోటు కూడా విడుదలైంది.
పండుగ కాలాల్లో ఆన్‌లైన్ మ్యూజియంలో కాయిన్లు, కరెన్సీ నోట్లు, స్టాంపులను ప్రదర్శనకు ఉంచుతామని మింటేజ్‌వరల్డ్.కామ్ సీఈవో సుశిల్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శన కోసం 100 రూ.1 రూపాయి నోట్లను, రూ.15వేలకు కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇటీవల కాలంలో చాలా మంది రూ.1 నోట్లను వాడుతున్నారని, దీంతో దీనికి మరింత గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. కానీ వందేళ్లు పూర్తిచేసుకున్న రూ.1 నోటుపై మాత్రం రిజిర్వు బ్యాంకు ఎలాంటి కామెంట్లు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment