ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. నికర ప్రీమియం ఆదాయం వృద్ధి చెందినప్పటికీ లాభంలో ఎదుగుదల లేదు.
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. నికర ప్రీమియం ఆదాయం వృద్ధి చెందినప్పటికీ లాభంలో ఎదుగుదల లేదు. కంపెనీ రూ.406 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.405 కోట్లతో పోలిస్తే కేవలం కోటి రూపాయలే మెరుగుపడింది. పాలసీలపై అధిక కమీషన్లు చెల్లించడం, పెట్టుబడులపై ఆదాయం తగ్గడం వంటివి లాభం పెరగకపోవడానికి కారణాలుగా కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ.4,820 కోట్ల ప్రీమియం ఆదాయం లభించింది. 2016–17 జూన్ క్వార్టర్‌లో ప్రీమియం ఆదాయం రూ.3,509 కోట్లతో పోల్చితే తాజాగా 35%కిపైగా వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం గతేడాది ఇదే క్వార్టర్లో రూ.9,074 కోట్లుగా ఉండగా, తాజా జూన్ త్రైమాసికంలో రూ.8,456 కోట్లకు క్షీణించింది.