ఆ ఉత్తర్వులు సవరించండి..!
జేపీ ఇన్‌ఫ్రా కేసులో సుప్రీంకు ఐడీబీఐ
న్యూఢిల్లీ: జేపీ అసోసియేట్స్– అనుబంధ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాపై దివాలా చర్యలు ప్రారంభించటాన్ని నిలిపేయాలన్న ఉత్తర్వులను సవరించాలని ఐడీబీఐ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐడీబీఐ వాదనలు వినడానికి అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వేకర్, జస్టిస్ అమిత్వా రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. సీనియర్ అడ్వొకేట్ ఏఎం సింఘ్వీ బ్యాంక్ తరఫున తన వాదనలు వినిపిస్తూ, ఎన్‌సీఎల్‌టీ– అలహాబాద్ ఇచ్చిన రూలింగ్‌కు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం వల్ల ఐడీబీఐ తీవ్ర ప్రతికూల పరిస్థితిలో పడిపోయిందని పేర్కొన్నారు.
బ్యాంక్ డబ్బు కూడా ప్రజల సొమ్మేనన్న విషయాన్ని పరిశీలించాలని కోరారు. దివాలా ప్రక్రియ ద్వారా ఇతర బ్యాంకింగ్ సంస్థలతోపాటు, గృహ కొనుగోలుదారుల క్లెయిమ్స్‌నూ పరిరక్షించే వీలుంటుందని అన్నారు. అయితే ఈ వాదనల్లో పసలేదని, గృహ కొనుగోలుదారుల సంతోషానికి కారణమైన ఉత్తర్వులను మార్చాల్సిన అవసరం లేదని గృహ కొనుగోలుదారుల్లో కొందరి తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ అజిత్ సిన్హా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 11న సమగ్ర విచారణ జరుగుతుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
జేపీ ఇన్‌ఫ్రాపై దివాలా చర్యలు ప్రారంభించి, ప్రధాన రుణదాతగా ఐడీబీఐ తన డబ్బు వసూలు చేసేసుకుంటే, సాధారణ గృహ కొనుగోలుదారుల సంగతేమిటని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పేర్కొంది. ఈ అంశంపై ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), జేపీ ఇన్‌ఫ్రా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఐడీబీఐ బ్యాంక్‌లకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ నిమిత్తం కేసును అక్టోబర్ 10కి వాయిదా వేసింది.