‘జేపీ’ ఇళ్లు కొన్నవారి సంగతేంటి?
► ఫ్లాట్ల కొనుగోలుదారుల పిల్‌పై స్పందించిన సుప్రీం
►జేపీ ఇన్‌ఫ్రా దివాలా ప్రక్రియపై ప్రస్తుతానికి స్టే
►ఆర్థికశాఖ, ఆర్‌బీఐ సహా ప్రతివాదులకు నోటీసులు
► తదుపరి విచారణ అక్టోబర్ 10న
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేసినందుకు జేపీ అసోసియేట్స్– అనుబంధ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాపై దివాలా చర్యలు ప్రారంభించటాన్ని నిలిపేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అలహాబాద్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై మంగళవారం స్టే విధించింది.
జేపీ ఇన్‌ఫ్రాకు చెందిన వెంచర్లలో ఇప్పటికే ఫ్లాట్లు కొనుక్కున్న వారి సంగతేమిటో చెప్పాలంటూ ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), జేపీ ఇన్‌ఫ్రా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఐడీబీఐ బ్యాంక్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం కేసును అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వేకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ... వ్యవహారం
దాదాపు రూ.526 కోట్ల మేర రుణాలు తీసుకుని జేపీ ఇన్‌ఫ్రా తిరిగి చెల్లించలేకపోయింది. ఈ కేసులో జేపీ ఇన్‌ఫ్రాపై దివాలా చట్టం– 2016 కింద చర్యలు తీసుకోవాలని ఎన్‌సీఎల్‌టీ– అలహాబాద్‌ను ఐడీబీఐ బ్యాంక్ ఆశ్రయించింది. ఐడీబీఐ వాదనతో ఏకీభవిస్తూ గత నెల 10న ఎన్‌సీఎల్‌టీ రూలింగ్ ఇచ్చింది. దివాలా చట్టం– 2016 కింద దివాలా ప్రక్రియను నిర్వహించడానికి ఐఆర్‌పీగా (ఇంటిర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్) అనూజ్ జైన్‌ను కూడా ఎన్‌సీఎల్‌టీ నియమించింది.
దీనిపై సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుక్కున్న వారు ఆందోళన వ్యక్తంచేశారు. జేపీ ఇన్‌ఫ్రా ఆస్తుల్ని వేలం వేసి ఆ డబ్బుల్ని బ్యాంకులు తీసుకుంటే తమ పరిస్థితి ఏంటంటూ నిలదీశారు. అంతా కలసి సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఎన్‌సీఆర్‌టీ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. దీంతో సుప్రీం ఆరుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జేపీ ఇన్‌ఫ్రా సంస్థ రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో పాటు రహదారుల నిర్మాణ వ్యాపారంలో కూడా ఉంది. ఢిల్లీ– ఆగ్రాను అనుసంధానం చేస్తూ నిర్మించిన యమునా ఎక్స్‌ప్రెస్‌వేను ఈ సంస్థే నిర్వహిస్తోంది.
వినియోగదారులు 32,000 మంది!
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారి కథనం ప్రకారం, 27 విభిన్న హౌసింగ్ ప్రాజెక్టుల్లో దాదాపు 32,000 వేల మంది నుంచి జేపీ ఇన్‌ఫ్రా డబ్బులు వసూలు చేసింది. వీరంతా కలసి చెల్లించిన మొత్తం రూ.25,000 కోట్లపైనే ఉంది. వీరిలో అత్యధికులు ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోనే ఉన్నారు. ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు వేల మంది సాధారణ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు.
వినియోగదారుల కోర్టులకు సైతం వారు వెళ్లలేని పరిస్థితిని ఈ ఉత్తర్వులు సృష్టించినట్లు పేర్కొన్నారు. జేపీ ఇన్‌ఫ్రాను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని కూడా కొనుగోలుదారులు కోరటం గమనార్హం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల తరహాలోనే ఫ్లాట్ యజమానులు, బయ్యర్లను కూడా సెక్యూర్డ్ క్రెడిటార్‌లుగా ప్రకటించాలని కేంద్రానికి ఆదేశాలివ్వాలని పిల్‌లో పిటిషనర్లు కోరారు.