వృద్ధి 7.7 శాతం: ఐడీఎఫ్‌సీ
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.7% నమోదవుతుందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఐడీఎఫ్‌సీ అంచనా వేసింది. ఇందుకు తగిన పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని ఐడీఎఫ్‌సీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రనీల్ పన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్ని సానుకూల ఆర్థిక పరిస్థితులు గత 10 ఏళ్లలో ఎన్నడూ లేవన్నారు. వర్షాభావ పరిస్థితులు, సంస్కరణల నత్తనడక వంటి అంశాలను కారణంగా చూపుతూ రేటింగ్ సంస్థ మూడీస్ తన అంచనాలను 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, తమ సంస్థ మూడీస్ రీతిలో విశ్లేషించడంలేదని అన్నారు.
సానుకూలతలు ఇవీ...
తగిన ఆహార నిల్వలు, భారీ డిమాండ్ వంటి అంశాలు దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తాయన్నది తమ అంచనా అని పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% నుంచి 5% శ్రేణిలో ఉండే అవకాశం ఉన్నందున, మార్చి నాటికి ఆర్‌బీఐ అరశాతం రెపో తగ్గించే అవకాశం ఉందని విశ్లేషించారు. క్రూడ్ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం భారత్‌కు ఆర్థికంగా కలిసి వస్తున్న మంచి అవకాశమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు డాలర్ మారకంలో రూపాయి 66 స్థాయిలో ఉండవచ్చన్నది అంచనా. మోడీ ప్రభుత్వం సంస్కరణ లకు కట్టుబడి ఉందన్న విషయం గమనించదగిందని పేర్కొన్నారు.