
భారత్‌లో ఇన్‌ఫ్రా అభివృద్ధికి ప్రపంచబ్యాంక్ సహకారం
భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ: భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇందులోభాగంగా వచ్చే ఐదేళ్లలో బాండ్‌ల జారీ ద్వారా(రూపాయి కరెన్సీలో) 2.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ.1,500 కోట్లు)ను సమీకరించనున్నట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ జిన్-యాంగ్ కయ్ వెల్లడించారు.
ప్రైవేటు రంగానికి రుణాలను అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ఐఎఫ్‌సీని నెలకొల్పింది. భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసే కంపెనీలకు నిధుల కల్పన కోసం ఈ మొత్తాన్ని ఐఎఫ్‌సీ వినియోగించనుంది. కాగా, ఐఎఫ్‌సీ చేపట్టనున్న ఈ బాండ్‌ల ఇష్యూ భారత్‌లో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అదేవిధంగా దీర్ఘకాలిక బాండ్ మార్కెట్ అభివృద్ధికి కొత్త ఉత్తేజం తీసుకురానుందని ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ వ్యాఖ్యానించారు. ఇతర సంస్థలు కూడా ఈ మార్గాన్ని అనుసరించేందుకు వీలవుతుందన్నారు. భారత్, ఐఎఫ్‌సీల మధ్య ఈ బాండ్‌ల జారీ ప్రోగ్రామ్ మరో కీలక మైలురాయిగా నిలవనుందని మాయారామ్ అభిప్రాయపడ్డారు.
మౌలిక రంగానికి నిధులందించేందుకు వీలుగా బ్యాంకులు దీర్ఘకాలిక బాండ్‌లు చేసేందుకు ఇటీవలే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనుమతించిన విషయాన్ని మాయారామ్ గుర్తు చేశారు. ఈ చర్యల ద్వారా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు వేగం పుంజుకోవడమేకాకుండా.. ప్రైవేటు రంగంలో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, తాము జారీ చేసే బాండ్‌లను విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని కయ్ వెల్లడించారు.