
ముంబై: భారీ రుణ భారంతో కుదేలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ భారత్‌లోని రహదారుల ఆస్తులన్నింటినీ విక్రయానికి పెట్టింది. రహదారుల రంగానికి సంబంధించిన కంపెనీల్లో ఈక్విటీ వాటాను విక్రయించనున్నామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరించిన 1,774 కి.మీల మేర ఉన్న ఏడు ఆపరేషనల్ యాన్యుటీ ఆధారిత ప్రాజెక్ట్‌లను, 6,572 కి.మీ. మేర విస్తరించిన 8 టోల్ ఆధారిత ప్రాజెక్టుల్లో వాటాను విక్రయించనున్నామని పేర్కొంది.
అంతేకాకుండా 1,736 కి.మీ. మేర విస్తరించిన నిర్మాణంలోని 4 రోడ్డు ప్రాజెక్టుల్లోని వాటాను కూడా అమ్మకానికి పెట్టినట్లు వివరించింది. తిరువనంతపురంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను, ఈపీసీ విభాగానికి సంబంధించిన ఆస్తులను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్స్‌కు చెందిన నిర్వహణ, మెయింటెనెన్స్ వ్యాపారాలను కూడా ఈ గ్రూప్ విక్రయించనున్నది.