సిడ్ని/వాషింగ్టన్: భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం వృద్ధి సాధించగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, ఎగుమతులు పెరగడం, వర్షాలు బాగా కురవడం, సంస్కరణల కారణంగా విశ్వాసం పెరగడం వంటివి దీనికి ప్రధాన కారణాలని ఐఎంఎఫ్ పేర్కొంది. సిడ్నీలో ప్రారంభం కానున్న జీ20 సమావేశాల నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ వివరాలు వెల్లడించింది. మెరుగైన వృద్ధి సాధించడానికి భారత్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని, సరఫరా సమస్యలను అధిగమించాలని సూచించింది. వేగంగా వద్ధి సాధించడానికి, ఉద్యోగ కల్పనకు, పేదరిక నిర్మూలనకు ఈ చర్య తీసుకోవాలసి ఉందని పేర్కొంది. కఠినమైన ద్రవ్యవిధానాల కారణంగా వృద్ధి మందగించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 4.6 శాతం వృద్ధి సాధించగలదని ఐఎంఎఫ్ తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థానంలోనే ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదక శక్తులుగు నిలుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్‌లో ఇటీవల కాలంలో వృద్ధి మందగించిందని పేర్కొంది.
ఆహార భద్రత చట్టం భేష్
భారత ఆహార భద్రత చట్టం చరిత్రాత్మకమైనదని ఐఎంఎఫ్ కితాబిచ్చింది. అధిక శాతం ప్రజలకు అందుబాటు ధరల్లో తగినంత ఆహార పదార్ధాలు ఈ చట్టం ద్వారా అందుతాయని పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత కార్యక్రమమని, దీనిద్వారా 120 కోట్ల భారత జనాభాలో మూడింట రెండొంతుల మందికి చౌక ధరల్లో ఆహార పదార్ధాలు అందుబాటులోకి వస్తాయని వివరించింది. ఈ చట్టం దృష్ట్యా కేంద్రం తాజా మధ్యంతర బడ్జెట్లో ఆహార సబ్సిడీ కోసం రూ.1,15,000 కోట్లు కేటాయించింది.
భారత్ వృద్ధి 5.4 శాతం
Published Fri, Feb 21 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement