ముంబై: ముడి చమురు ధరలు భగ్గుమంటుండటంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) లాభదాయకతకు చిల్లుపడే అవకాశాలు కనిపిసున్నాయి. భారత్ తన అవసరాలకు భారీగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ధర బుధవారం రాత్రి 9.30 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఏకంగా బ్యారెల్ 67.50 డాలర్ల స్థాయికి చేరింది. 2016 చివరి నాటికి బ్యారెల్ ధర 48 డాలర్ల స్థాయిలో ఉండేది. అంటే గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 40 శాతానికిపైగా పెరిగింది.
ధరలెందుకు పెరుగుతున్నాయంటే...
►అమెరికాలో సంభవించిన ‘ఇర్మా’ హరికేన్‌తో రిఫైనరీలు కొన్నాళ్లు మూతబడ్డాయి. కానీ తుఫాను ప్రభావం తగ్గడంతో రిఫైనరీలన్నీ తెరుచుకుని ఒక్కసారిగా క్రూడ్‌కు డిమాండ్ పెరిగింది.
►దాదాపు ఇదే సమయంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కోతను పొడిగించాలని ఒపెక్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మరింత భారీ పెరుగుదలకు దారితీసింది.
►డాలర్ ఇండెక్స్ బలహీనత కూడా క్రూడ్ ధరల పెరుగుదలకు కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. డాలర్ తగ్గుదల వల్ల చమురు ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గుతాయి.
►ఇక ఉత్తరకొరియా, ఇరాక్ దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రికత్తలు చమురు మంటకు ఆజ్యం పోశాయి.
►ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మెరుగుపడుతున్న ధోరణి కూడా ముడి చమురుకు డిమాండ్‌ను పెంచింది.
►వీటన్నింటికీ తోడు కొన్ని దేశాల్లో పైపులైన్లు పేలుళ్లు, అంతర్గత ఉద్రిక్తతల వంటి అంశాలు చమురు ధరలను పెంచాయి.
దేశీయ ఓఎంసీలపై ప్రభావం...
బీఎస్‌ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ గడచిన 3 నెలల్లో 9.71% పెరిగింది. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సూచీ 8.86 శాతం ఎగసింది. కానీ బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఐఓసీ షేర్ 3 శాతం, హెచ్‌పీసీఎల్ షేర్ 2.5 శాతం తగ్గింది. అయితే గెయిల్ కొనుగోలు వార్తలతో బీపీసీఎల్ 10% పెరిగింది.
పడిపోతున్న మార్జిన్లు...రక్షిస్తున్న రూపాయి
నిజానికి క్రూడ్ ధరలు పెరగటం వల్ల చమురు కంపెనీల మార్జిన్లు గణనీయంగా పడిపోతున్నాయి. రూపాయి బాగా బలపడటం వీటిని కొంతవరకూ ఆదుకున్నదనే చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో డీజిల్, పెట్రోల్‌పై మార్కెటింగ్ మార్జిన్ లీటరుకు 3.10 పైసలు ఉంటే, ప్రస్తుతం ఇది రూపాయికి పడింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, దీనికనుగుణంగా దేశీయంగా ధరలు పెంచకపోవడం దీనికి కారణమనేది కంపెనీల మాట. అయితే, అం తర్జాతీయంగా ధరలు తగ్గినపుడు దేశీయంగా తగ్గలేదన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
కష్టకాలమే..!
క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల చమురు మార్కెటింగ్ కంపెనీల రోజూవారీ వ్యయ అవసరాలను పెంచుతుంది. దీనికితోడు స్వల్పకాలిక రుణ స్థాయిలపై సైతం ఇది ప్రభావం చూపుతుంది. భారత ఎంసీఏల లాభదాయకతపై ఇది ప్రభావం చూపుతుంది. స్థూల అండర్ రికవరీలల్లో నుంచి కేటాయింపులు జరుపుకోవాలని ప్రభుత్వ రంగంలోని ఓఎంసీలకు ఆదేశాలు జారీ అయినా... అదీ ఆయా కంపెనీల లాభదాయకతకు దెబ్బే. ఇక మార్కెట్ నిర్ధారిత స్థాయిల వద్ద ఆటో ఫ్యూయెల్స్ ధరలను కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికీ తాజా పరిస్థితి పరీక్ష వంటిదే. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ధర పెంచితే, దేశంలో అన్ని స్థాయిల్లో ధరల పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుంది. ఇక దేశీయంగా ఆర్థిక అంశాలను చూస్తే, 2016–17తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) రెట్టింపయ్యే అవకాశం ఉంది. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) క్యాడ్ 1.5%కి చేరే వీలుంది.
– కె.రవిచంద్రన్, ఇక్రా
ముడి చమురు ధరలు పెరిగితే చమురు కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు తగ్గుతాయి. మూలధన ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నగదు నిల్వలు హరించుకుపోతాయి. ఈ కంపెనీల షేర్ల అవుట్‌లుక్ పెద్దగా ఆశావహంగా కూడా ఏమీ లేదు.
– కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్
Comments
Please login to add a commentAdd a comment