‘అప్పు’డే చదువుకుంటారా? | Increase of Educational loans of students | Sakshi
Sakshi News home page

‘అప్పు’డే చదువుకుంటారా?

Published Mon, Jul 13 2015 12:12 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

‘అప్పు’డే చదువుకుంటారా? - Sakshi

‘అప్పు’డే చదువుకుంటారా?

- ఖర్చుతో  పాటే పెరుగుతున్న విద్యా రుణాలు
- సగటు రుణంలో ఏడాదికి 35 శాతం పెరుగుదల
- ఈ రంగంలోనూ పెరుగుతున్న మొండి బకాయిలు
- అప్పులిచ్చేటపుడు ఆచితూచి వ్యవహరిస్తున్న బ్యాంకులు
- కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం విద్యా రుణం సులువే
- తొలి ఏడాది నుంచే తిరిగి చెల్లిస్తే ఈఎంఐలూ భారం కావు

చదువంటే మాటలు కాదు. మంచి స్కూల్లో ఎల్‌కేజీలో చేర్చి డొనేషన్‌తో సహా వార్షిక ఫీజులు కట్టాలంటేనే... మధ్య తరగతి మనిషికి చుక్కలు కనిపిస్తాయి. ఇక చదువు పెరిగేకొద్దీ డబ్బుల లెక్కలూ పెరుగుతుంటాయి. ఎస్‌ఎస్‌సీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ... ఇలా ఏదో ఒక స్ట్రీమ్‌లో 10వ తరగతి అయిందనిపించాక అసలు కథ మొదలవుతుంది. ఇంటర్మీడియెట్‌కు ఏదో ఒక కార్పొరేట్ కాలేజీని ఆశ్రయించకతప్పదు. ఎందుకంటే ఏ ప్రొఫెషనల్ కోర్సుకైనా పునాది అక్కడే కనక. ఆ ఇంటర్ పూర్తయ్యాక... ప్రొఫెషనల్ కోర్సుల భారం మొయ్యటం ఎగువ మధ్య తరగతి వారికి కూడా అసాధ్యమే. ఇదిగో... ఇక్కడే బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. మీ చదువుకు మేం రుణమిస్తామంటూ విద్యారుణాలకోసం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ విద్యారుణాలు ఎవరికిస్తారు? ఎంత ఇస్తారు? హామీ ఏం ఉండాలి? ఎలా తీర్చాలి? వడ్డీ ఎంత? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం...
 
విద్యా ఖర్చులు ఏటికేడాది ఎలా పెరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ఒక్కసారి క్రెడిట్ రేటింగ్ సంస్థ సిబిల్ గణాంకాలు చూడాలి. వీటి ప్రకారం 2013లో సగటు విద్యారుణం విలువ రూ.4.5 లక్షలు. 2014కు వచ్చేసరికి అది రూ.6 లక్షలకు చేరింది. అంటే ఒక ఏడాదిలో దాదాపు 35 శాతం పెరుగుదలన్న మాట. ఈ ఏడాది ఇది ఇంకా పెరగవచ్చన్నది బ్యాంకు వర్గాల మాట. విద్యా వ్యయం పెరుగుతుండటంతో సగటు రుణమే కాదు... రుణాలు తీసుకునేవారూ పెరుగుతున్నారు. రుణ మొత్తమూ పెరుగుతోంది. 2014లో రూ.53,334 కోట్లుగా ఉన్న విద్యారుణాలు 2015 మార్చినాటికి రూ.63,800 కోట్లకు చేరుకున్నాయి. అయితే ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మందగించి... రుణం తీసుకొని చదువుకున్న తర్వాత భారీ
 
జీతాలతో కూడిన ఉద్యోగాలు లభించడం కష్టమవుతోంది. దీంతో విద్యారుణాల్లో మొండిబకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. ఇవి క్రమంగా పెరుగుతుండటంతో ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విద్యారుణాల మంజూరులో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
తిరిగి చెల్లించాల్సిందెప్పుడు?
- విద్యారుణాలు మిగిలిన రుణాల్లా తీసుకున్న మరుసటి నెల నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తయ్యాకే చెల్లించాలి. చాలా బ్యాంకులు కనీసం ఒక ఏడాది... లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి నుంచి రుణం చెల్లించే అవకాశమిస్తున్నాయి.
- కోర్సు చేస్తున్న కాలంలో సాధారణ వడ్డీని లెక్కకట్టి దాన్ని అసలుకి కలుపుతారు. అక్కడి నుంచి చక్రవడ్డీని లెక్కించి ఆ ప్రకారం ఈఎంఐ చెల్లించాలి.
- రుణాన్ని గరిష్టంగా 8 సంవత్సరాల్లో చెల్లించడానికి బ్యాంకులు అనుమతిస్తున్నాయి. కాబట్టి విద్యారుణం భారం కాకుండా ఉండాలంటే తీసుకున్న తొలి ఏడాది నుంచే తిరిగి చెల్లించాలి.
- చాలా బ్యాంకులు విద్యారుణాల్లో ముంధస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీలూ వసూలు చేయడం లేదు. లోన్ తీసుకున్న మరుసటి నెల నుంచే చెల్లించేవారికి కొన్ని బ్యాంకులు 1 శాతం రాయితీ కూడా ఇస్తున్నాయి.
 
ఏయే చదువులకు..?
- ఇంటర్ తరవాత చదివే కోర్సులన్నిటికీ విద్యా రుణం లభిస్తుంది. కాకుంటే వీటికి యూజీసీ, ఏఐసీటీఈ, ఐఎంసీ వంటి ప్రభుత్వ సంస్థల గుర్తింపు ఉండాలి.
- ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చేసే కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు, గ్యారంటీ ఉపాధి లభించే టీచర్, నర్సింగ్, పెలైట్ ట్రైనింగ్‌లకూ రుణాలిస్తారు.
- ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) గుర్తించిన 1,100 సంస్థల్లో చేసిన  కోర్సులకే బ్యాంకులు విద్యా రుణాలిస్తున్నాయి. రుణం తీసుకునే సదరు కోర్సుకు, లేదా సంస్థకు ఐబీఏ గుర్తింపు ఉందా లేదా అన్న విషయం పరిశీలించడం మర్చిపోవద్దు.
 
ఎంత రుణం... ఏ హామీ?
- చాలా బ్యాంకులు ఇండియాలో చదివే కోర్సులకు గరిష్టంగా రూ. 10 లక్షల వరకు, కొన్ని ప్రత్యేక కోర్సులకు గరిష్టంగా రూ. 30 లక్షల వరకు రుణమిస్తున్నాయి.
- విదేశీ విద్యకైతే గరిష్టంగా రూ.30 లక్షల వరకు.. కొన్ని ప్రత్యేక కోర్సులకు అవసరమైతే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని కూడా ఇస్తున్నారు.
- ఎంత రుణం వస్తుందనేది కోర్సు ఫీజు, కావాల్సిన పుస్తకాలు, ఇతర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. రుణ మొత్తాన్ని లెక్కించడంలో కాలేజీ, స్కూల్, హాస్టల్‌కు చెల్లించాల్సిన ఫీజులు, ఎగ్జామినేషన్స్, లైబ్రరీ, ల్యాబరేటరీ, పుస్తకాలు, యూనిఫాంతో పాటు ఇతర పరికరాల ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
- రూ.4 లక్షల లోపు రుణానికి బ్యాంకులు ఎలాంటి హామీ అడగటం లేదు. రూ.4-7.5 లక్షల మధ్య అయితే థర్డ్‌పార్టీ గ్యారంటీని... ఆపై మొత్తానికి థర్డ్‌పార్టీతో పాటు ఏదైనా ఆస్తిని ష్యూరిటీగా చూపించాల్సి ఉంటుంది.
 
వడ్డీ ఎంత?
- విద్యారుణాలపై వడ్డీ ఎంతనేది రుణ మొత్తం, కాలపరిమితి, కోర్సు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది బ్యాంకుల బేస్ రేటు కంటే  2-3 శాతం అధికంగా ఉంటుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4 లక్షల లోపు రుణాలపై 13.35 శాతం, రూ.4-7.5 లక్షల మొత్తానికి 13.60%, ఆపై మొత్తానికి 11.6% వడ్డీ వసూలు చేస్తోంది.
- చాలా బ్యాంకులు అమ్మాయిల విద్యా రుణాలకు 0.5 నుంచి 1 శాతం వరకు వడ్డీలో రాయితీ ఇస్తున్నాయి. రుణ గ్రహీతల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షల లోపు ఉన్నా వడ్డీ రాయితీ ఇస్తున్నారు. 2009 ఏప్రిల్ తర్వాత ఈ రాయితీ అమల్లోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement