సమైక్య బంద్ సక్సెస్
- మిన్నంటిన నిరసనలు
- స్తంభించిన ఆర్‌టీసీ సేవలు
- మూతపడిన బ్యాంకులు, థియేటర్లు, విద్యా సంస్థలు
- తిరుమలకు బస్సుల రాకపోకలమినహాయింపు
- జాతీయ రహదారుల్లో నిలిచిన ప్రైవేట్ వాహనాలు
సాక్షి, చిత్తూరు: సమైక్య బంద్ జిల్లాలో సక్సెస్ అయ్యింది. ఏపీఎన్జీవోలు, వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు గురువారం జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, పుంగనూరు, నగరి పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలను ఏపీఎన్జీవోలు దగ్గరుండి మూయించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. నగరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కే.రోజా, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు. కార్యకర్తలతో కలిసి రోడ్లపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. పుంగనూరు, మదనపల్లె, తిరుపతి, చిత్తూరు నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
మదనపల్లెలో
వైఎస్సార్‌సీపీ నాయకులు నీరుగట్టుపల్లెలో బంద్ నిర్వహించారు. ఎపీఎన్జీవోల ఆధ్వర్యంలో మానవహారాలు చేపట్టారు. నీరుగట్టువారిపల్లె మార్కెట్‌యార్డు వద్ద విద్యార్థులు, ఎన్జీవోలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం వరకు దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు అక్కడక్కడా తిరిగాయి.
పుంగనూరులో
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ జరిగింది. అన్ని రహదారులు దిగ్బంధ నం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జేఏసీ చైర్మన్ వరదారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. టీడీపీ నాయకుడు శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
నగరిలో
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కే .రోజా ఆధ్వర్యంలో ఉయ్యాల కాలువవద్ద రాస్తారోకో చేశారు. రాకపోకలు స్తంభించాయి.
పలమనేరు
ఎన్జీవోలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పట్టణ సరిహద్దుల్లో వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నాయకులు బంద్ పాటించారు. బంద్‌లో మాజీ ఎమ్మేల్యే అమరనాథరెడ్డి పాల్గొని ఆందోళనకారుల నుద్దేశించి ప్రసంగించారు.
కుప్పంలో
వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ఏపీ ఎన్జీవోలు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సాయంత్రం వరకు బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.
శ్రీకాళహస్తిలో
ఎపీఎన్జీవోలు బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దుకాణాలు మూత పడ్డాయి.
చిత్తూరులో
గాంధీ విగ్రహం వద్ద తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే వాహనాలను ఆపేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలీసులు జోక్యం చేసుకుని కొన్ని వాహనాలను వదిలారు. నగరంలోకి ఇతర వాహనాలను అనుమతించలేదు. తిరుమలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు, డిపార్టుమెంట్ పరీక్షలకు మినహాయింపు ఇచ్చారు. వాణిజ్య సంస్థలు, బ్యాంక్‌లు, థియేటర్లు మూతపడ్డాయి. కలెక్టరేట్ మూతపడింది. ప్రభుత్వకార్యాలయాలూ పనిచేయలేదు.
తిరుపతిలో
సాప్స్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎం.ఆర్.పల్లె సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఆర్‌టీసీ ఉద్యోగులు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. ఆర్‌డీవో, ఎం.ఆర్.వో కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఎస్వీయూలోనూ తరగతులు బహిష్కరించారు. తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.