న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ సందర్భంగా... భారత మ్యాచులకు అడ్డు పడొద్దు వరుణుడా..!? అని సగటు అభిమానులు ప్రార్థించడం సర్వ సాధారణం. కానీ, బీమా కంపెనీలు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే వర్షం కారణంగా భారత మ్యాచులు రద్దయితే బీమా కంపెనీలు పరిహారం రూపంలో రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత్ మరో నాలుగు మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఈ నాలుగు కూడా వర్షం కారణంగా రద్దు కావన్న ఆశలతో బీమా కంపెనీలు ఉన్నాయి.
తొలి దశలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను వర్షం కారణంగా కోల్పోవాల్సి వచ్చిన విషయం గమనార్హం. ప్రస్తుత ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లకు వర్షం అడ్డుతగిలింది. క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి మన దేశంలో రూ.150 కోట్ల బీమా మార్కెట్ ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ సాధారణంగా ఈ తరహా బీమా పాలసీలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. క్లెయిమ్స్ ఎదురైతే వీటిపైనే ఎక్కువ భారం పడుతుంది.
భారత్–పాక్ మ్యాచ్‌కు రూ.50కోట్లు
భారీగా వెచ్చించి ఐసీసీ క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కులను కొనుగోలు చేసిన ప్రసార మాధ్యమాలు సాధారణంగా క్రికెట్ మ్యాచులు రద్దయితే తలెత్తే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ పాలసీలను తీసుకుంటుంటాయి. దీంతో వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా, వర్షం కారణంగా అవరోధం ఏర్పడి మ్యాచ్‌ను కుదించడం వల్ల ప్రకటనల ఆదాయం నష్టపోవడం జరిగినా పరిహారం పొందొచ్చు. మ్యాచ్ యథావిధిగా జరిగితే బీమా కంపెనీలు ఊపిరిపీల్చుకున్నట్టే. భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏకంగా రూ.50 కోట్ల బీమా తీసుకోవడం దీనికున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు... ఒక్కో మ్యాచ్ ప్రసార సమయంలో ప్రకటనలపై రూ.5–50 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అదే ఫైనల్స్, సెమీ ఫైనల్స్ వంఇ ప్రత్యేక మ్యాచుల్లో ఈ ఆదాయం రూ.70–80 కోట్ల వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment