ఆర్థిక వృద్ధికి పుత్తడి..
భారత్‌కు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సూచన
ముంబై/న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మెరుగుపర్చేందుకు పుత్తడిని వినియోగించాలని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) సూచించింది. ఉద్యోగాల కల్పనకు, నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు, ఎగుమతులు..ఆదాయాలను పెంచుకునేందుకు దీన్ని ఉపయోగించాలని పేర్కొంది. ముంబైలో రెండో అంతర్జాతీయ బులియన్ సదస్సు సందర్భంగా పరిశ్రమపై ఆవిష్కరించిన విజన్ 2020 నివేదికలో డబ్ల్యూజీసీ ఈ విషయాలు ప్రస్తావించింది. ప్రస్తుతం దేశీయంగా ఇళ్లల్లో, గుళ్లల్లో దాదాపు 22,000 టన్నుల మేర బంగారం ఉందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు.
పసిడి ఎగుమతులు అయిదు రెట్లు పెంచడం, ఉపాధి అవకాశాలను రెట్టింపు చేయడం ద్వారా భారత్‌ను ప్రపంచ జ్యువెలర్‌గా తీర్చిదిద్దడం విజన్ 2020 లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 8 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారు ఆభరణాల ఎగుమతులు అప్పటికల్లా 40 బిలియన్ డాలర్లకు చేర్చేలా భారత్ లక్ష్యం నిర్దేశించుకోవాలని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. నిర్దిష్ట ధరకు మించిన ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని సూచించింది. అలాగే, ఈ రంగంలోని వారికి శిక్షణ కల్పించేందుకు ‘కారీగర్ సంక్షేమ పథకం’ ఏర్పాటు చేయాలని తెలిపింది. గోల్డ్ టూరిజం సర్క్యూట్‌ను కూడా ప్రారంభించే అవకాశాలు పరిశీలించాలని పేర్కొంది.