డిస్కౌంట్స్‌... టేకాఫ్‌!! | IndiGo offers 10 lakh seats at fares starting Rs 999 | Sakshi
Sakshi News home page

డిస్కౌంట్స్‌... టేకాఫ్‌!!

Sep 4 2018 12:54 AM | Updated on Sep 4 2018 12:54 AM

IndiGo offers 10 lakh seats at fares starting Rs 999 - Sakshi

న్యూఢిల్లీ: ఆఫ్‌ సీజన్‌లో ప్రయాణికులను ఆకర్షించేందుకు దేశీ చౌక చార్జీల విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పోటాపోటీగా డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రూ. 999 టికెట్‌ చార్జీలు మొదలుకుని 20 శాతం దాకా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. ఒకవైపు ముడి చమురు రేట్ల పెరుగుదల, మరోవైపు రూపాయి  క్షీణతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మార్కెట్‌లో పట్టు కోసం ఎయిర్‌లైన్స్‌ తాజాగా డిస్కౌంట్లకు తెరతీయడం గమనార్హం.  

ఇండిగోలో పది లక్షల సీట్లు..
తమ నెట్‌వర్క్‌లోని 59 ప్రాంతాలకు ప్రయాణించే వారికి పది లక్షల పైచిలుకు సీట్లను డిస్కౌంట్‌ రేట్లకే అందిస్తున్నట్లు ప్రకటించింది ఇండిగో ఎయిర్‌లైన్స్‌. రూ.999 నుంచి వన్‌ వే (అన్నీ కలిపి) టికెట్‌ అందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 నుంచి 2019 మార్చి 30 దాకా ప్రయాణాల కోసం ఈ ఆఫర్‌లో బుక్‌ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సోమవారం ప్రారంభమైన ‘ఫెస్టివ్‌ సేల్‌‘    నాలుగు రోజులు కొనసాగుతుందని ఇండిగో పేర్కొంది. మొబైల్‌ వాలెట్‌ సంస్థ మొబిక్విక్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుంటే రూ. 600 దాకా సూపర్‌ క్యాష్‌ లేదా 20 శాతం మేర రీఫండ్‌ కూడా ప్రకటించింది ఇండిగో.  

ఎయిర్‌ఏషియా ఆఫర్‌..
ఎయిర్‌ఏషియా ఇండియా కూడా అదే బాటలో దేశీ ప్రయాణాలకు రూ. 999 నుంచి, విదేశీ ప్రయాణాలకు రూ. 1,399 నుంచి టికెట్లను ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర 120 పైచిలుకు ప్రాంతాలకు డిస్కౌంట్‌ చార్జీలు వర్తిస్తాయి. అంతర్జాతీయంగా చూస్తే... కౌలాలంపూర్, బ్యాంకాక్, సిడ్నీ మొదలైన రూట్లలో కూడా చౌక చార్జీలను ఆఫర్‌ చేస్తోంది ఎయిర్‌ఏషియా ఇండియా. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి నవంబర్‌ 26 దాకా చేసే ప్రయాణాలకు సంబంధించి ఈ సంస్థ సెప్టెంబర్‌ 2 నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ ‘బిగ్‌ సేల్‌‘ ఎనిమిది రోజుల పాటు ఉంటుంది.

గోఎయిర్‌ సైతం..
మరో చౌక టిక్కెట్ల విమానయాన సంస్థ గోఎయిర్‌ కూడా దేశీ ప్రయాణాలకు రూ. 1,099 నుంచి టికెట్లు ఆఫర్‌ చేస్తోంది. సెప్టెంబర్‌ 3 నుంచి 2019 మార్చి 31 దాకా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్‌ 3న ప్రారంభమైన టికెట్ల విక్రయం మూడు రోజుల పాటు సాగుతుందని సంస్థ వెల్లడించింది.  

చమురు, రూపాయి కుంగదీస్తున్నా..
సాధారణంగా పండుగలు మొదలయ్యే దాకా విమానయాన సంస్థలకు ఆఫ్‌సీజన్‌గానే ఉంటుందని, దీంతో అవి డిమాండ్‌ను పెంచేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆఫర్లు ఇస్తుండటం గమనార్హమని పేర్కొన్నాయి. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడం, రూపాయి రికార్డు స్థాయిలో క్షీణిస్తుండటం దేశీ విమానయాన సంస్థలను కుంగదీస్తోంది.

అయితే, విపరీతమైన పోటీ నెలకొనడంతో టికెట్‌ చార్జీలను పెంచలేని పరిస్థితి నెలకొంది.మార్కెట్‌లో సింహభాగం వాటా ఉన్న సంస్థ డిస్కౌంట్లకు టికెట్లు ఆఫర్‌ చేస్తే మిగతా కంపెనీలు కూడా అదే బాట పట్టక తప్పదని విశ్లేషకులు పేర్కొన్నారు.పెరిగిన వ్యయాలను ప్యాసింజర్లకు బదలాయించలేని పరిస్థితుల కారణంగా కొన్ని విమానయాన సంస్థలు గత కొన్నాళ్లుగా నష్టాలు,  తక్కువ స్థాయిలో లాభాలే నమోదు చేస్తున్నాయి.

ముడిచమురు ధరల పెరుగుదల, అధిక వడ్డీ రేట్లు, సిబ్బంది వేతనాల పెరుగుదల వంటి కారణాలతో ఈ ఏడాదిలో భారత్‌ సహా అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్‌ లాభాలు భారీగా తగ్గొచ్చని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(ఐఏటీఏ) అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా  ఎయిర్‌లైన్స్‌ లాభాలు 33.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉండొచ్చని పేర్కొంది. దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ఈ ఏడాది 1.65–1.90 బిలియన్‌ డాలర్ల మేర భారీ స్థాయిలో ఉండవచ్చని సెంటర్‌ ఫర్‌ ఏషియా పసిఫిక్‌ ఏవియేషన్‌(సీఏపీఏ) పేర్కొంది. గతంలో 430–460 మిలియన్‌ డాలర్లుగా మాత్రమే ఉండొచ్చని అంచనావేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement