మూడో నెలా.. మైనస్ లోనే
♦ జనవరిలో 1.5 శాతం క్షీణించిన పారిశ్రామికోత్పత్తి సూచీ...
♦ తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ పనితీరు ఫలితం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2016 జనవరిలో 2015 ఇదే నెలతో పోల్చిచూస్తే... అసలు వృద్ధి లేకపోగా 1.5 శాతం (మైనస్) క్షీణించింది. ఇలాంటి ధోరణి ఇది వరుసగా మూడవ నెల. ఈ సూచీ నవంబర్‌లో - 3.4 శాతం, డిసెంబర్‌లో - 1.2 శాతం క్షీణించింది. తయారీ రంగం పేలవ పనితీరు, డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ పరికరాల ఉత్పత్తుల క్యాపిటల్ గూడ్స్ విభాగం మందగమన ధోరణి తాజా నిరుత్సాహ ఫలితానికి కారణమని శుక్రవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన తొలి గణాంకాలు వెల్లడించాయి. 2015 జనవరిలో ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతం.
జనవరిలో కీలక రంగాలను చూస్తే...
తయారీ: మొత్తం సూచీలో 75 శాతం వాటా ఉన్న ఈ విభాగం 2015 జనవరిలో 3.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే... 2016 జనవరిలో అసలు వృద్ధి లేకపోగా - 2.8 శాతం క్షీణించింది. ఈ విభాగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 10 ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి.
కేపిటల్ గూడ్స్: 12.4% వృద్ధి బాట నుంచి - 20.4% క్షీణితలోకి పడింది.
మైనింగ్: ఈ రంగం కొంత మెరుగుపడింది. - 1.8 శాతం క్షీణత నుంచి 1.2 శాతం వృద్ధికి మళ్లింది.
విద్యుత్: ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 3.3% నుంచి 6.6%కి ఎగసింది.
వినియోగ వస్తువులు: ఉత్పత్తి - 1.9 శాతం క్షీణించింది. ఇందులో భాగమైన కన్జూమర్ డ్యూరబుల్స్ మాత్రం 5.7 శాతం నుంచి 5.8 శాతం వృద్ధికి మళ్లింది. అయితే నాన్-డ్యూరబుల్స్ విభాగం మాత్రం 0.3 శాతం వృద్ధి నుంచి - 3.1 శాతం క్షీణతలోకి పడింది.
కొన్ని ఉత్పత్తులను చూస్తే...
కేబుల్స్, ఇన్సులేటెడ్ రబ్బర్, యాంటీబయోటిక్స్, స్టెయిన్‌లెస్ అండ్ అలోయ్ స్టీల్స్, స్పాంజ్ ఐరన్, పాసింజర్ కార్ల విభాగాలు ప్రతికూల ఫలితాన్ని చూశాయి. అయితే ఎలక్ట్రిసిటీ, కమర్షియల్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, సిమెంట్, రత్నాలు, ఆభరణాల విభాగాలు మాత్రం సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి.
ఆర్థిక సంవత్సరంలో ఇలా....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 2.7 శాతంగా నమోదయ్యింది. క్రితం ఆర్థిక సంవత్సరం (2014-15)లో కూడా ఈరేటు ఇంచుమించు ఇదే స్థాయి వద్ద ఉంది.
రేట్ల తగ్గింపునకు అవకాశం...
మూడు నెలలుగా పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత, లక్ష్యాలకు లోబడి కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండాలన్న ప్రభుత్వ సంకల్పం వంటి అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు కోతకు అవకాశం ఇస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 5న ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 6.75 శాతం) తగ్గించాలని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 5 లేదా ఆ లోపు పావుశాతం రేటు కోత ఖాయమన్న అంచనాలు వినపడుతున్నాయి.