యూరోప్‌లోనూ ఇన్ఫోసిస్ స్థానిక మంత్రం
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ యూరోప్‌లోనూ స్థానిక బాట పట్టనుంది. మరింత మంది స్థానికులను నియమించుకోవడంతోపాటు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారీగా పెట్టుబడులు కూడా పెడుతోంది. ఉద్యోగ వీసాల పరంగా కఠిన నిబంధనల నేపథ్యంలో అమెరికాలో 10వేల మంది స్థానికులను నియమించుకోనున్నట్టు ఈ సంస్థ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
అమెరికా తర్వాత ఇన్ఫోసిస్‌కు యూరోప్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. సంస్థ ఆదాయాల్లో అమెరికా నుంచి 61 శాతం వస్తుండగా, 22 శాతం యూరోప్ నుంచే వస్తోంది. అమెరికాలో వృద్ధి 1.3 శాతంగా ఉంటే, యూరోప్‌లో 4.7 శాతంగా ఉండడం గమనార్హం. యూరోప్‌లో స్థానికులను నియమించుకునేందుకు ఇప్పటికే ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తున్నామని ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్‌జోషి తెలిపారు. ఈ ప్రాంతంలో వృద్ధి అనేది అన్ని విభాగాల్లోనూ విస్తృతంగానే ఉన్నట్టు తెలిపారు.
బ్రెగ్జిట్ వల్ల ఐటీపై వ్యయాలు తగ్గుతాయన్న ఆందోళన ఏడాది క్రితం వినిపించగా, ఇంత వరకు ఆ ప్రభావమేమీ కనిపించలేదని జోషి స్పష్టం చేశారు. యూరోప్‌లోని నార్డిక్స్, దక్షిణ యూరోప్, బెనెలక్స్ తదితర ప్రాంతాల్లో తమకు దీర్ఘకాలంలో అపార అవకాశాలున్నాయని తెలిపారు.