
నవకల్పనలకు రూ.30 కోట్ల రివార్డు
న్యూఢిల్లీ: దేశంలో నవకల్పన(ఇన్నోవేషన్)లు, ఔత్సాహిక వ్యాపారవేత్త(ఎంట్రప్రెన్యూర్స్)లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం రూ.30 కోట్ల రివార్డుతో పాటు కార్పొరేట్ల లాభాల్లో 1 శాతాన్ని పక్కనబెట్టాలని నీతి ఆయోగ్ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రముఖ విద్యావేత్త తరుణ్ ఖన్నా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ త్వరలోనే నివేదికను కేంద్రానికి సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇంకా అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఎయిమ్), స్వయం ఉపాధి, నైపుణ్యాల వినియోగం(ఎస్‌ఈటీయూ) ప్రోగ్రామ్‌ల స్వరూపానికి సంబంధించికీలక ప్రతిపాదనలు కూడా ఇం దులో ఉన్నాయి. ఇన్నోవేషన్‌లో ప్రత్యేక అవార్డుల(గ్రాండ్ చాలెంజెస్)పై ఎయిమ్ నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచించింది. నిర్ధేశించిన వ్యవధిలోగా నిర్ధిష్ట లక్ష్యాన్ని సాధించిన ఒక్కో చాలెంజ్ (అవార్డు)కు రూ.10-30 కోట్ల నగదును బహుమానంగా ఇవ్వాలని పేర్కొంది. ముఖ్యాంశాలు...
* యూనివర్సిటీల్లోని రీసెర్చ్ ల్యాబ్‌లు లేదా పరిశ్రమలు-యూనివర్సిటీల భాగస్వామ్యంతో చేపట్టే రీసెర్చ్ కార్యకలాపాలకు కార్పొరేట్ల లాభాల్లో 1 శాతాన్ని వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలి.
* కార్పొరేట్లు వెచ్చించే ఇటువంటి పెట్టుబడులకు పన్ను రాయితీలు కూడా ఇవ్వాలి.
* ఇంకా భాగస్వామ్యాలకు ఊతమిచ్చేందుకు ‘మేక్ ఇన్ యూనివర్సిటీస్’ ప్రోగ్రామ్‌ను అమలు చేయాలి. దీని ప్రకారం దాదాపు 500 ఇన్నోవేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
* విదేశీ డిఫెన్స్ కంపెనీలతో ప్రభుత్వం 5 బిలియన్ డాలర్లకు మించి కుదుర్చుకునే కాంట్రాక్టు విలువలో 5 శాతాన్ని రీసెర్చ్ ఆధారిత యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు వినియోగించేవిధంగా నిబంధనలను విధించాలి.
* ఆరంభ స్థాయిలో ఉన్న వెంచర్ ఫండ్స్‌కు నిధుల కల్పన కోసం రూ.5,000 కోట్ల మూలనిధి(కార్పస్)తో ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్‌ఓఎఫ్)ను కూడా నెలకొల్పాలి.