ఫేస్‌బుక్ ఆప్... ఫ్రీగా ఇంటర్నెట్!
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు భలే సందడి చేస్తున్నాయి. అయినా.. ఇంకా అనేక చోట్ల ఇంటర్నెట్ అందుబాటులో లే నివారు మాత్రం గణనీయంగానే ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో సరికొత్త మొబైల్ అప్లికేషన్(ఆప్)ను విడుదలచేసినట్లు ‘ఫేస్‌బుక్’ వెబ్‌సైట్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ‘ఇంటర్నెట్.ఆర్గ్’ అని పేరు పెట్టిన ఈ ఆప్‌తో ఎవరైనా సరే ఉచితంగానే ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. స్థానికంగా వైద్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు, వాతావరణానికి సంబంధించిన సమాచారం కోసం, ప్రాథమిక స్థాయిలో కమ్యూనికేషన్స్ కోసం ఫ్రీగా బ్రౌజ్ చేసుకోవచ్చు.
అంతేకాదండోయ్.. ఈ ఆప్‌తో ఫేస్‌బుక్‌ను, గూగుల్ సెర్చ్‌ను, వికీపీడియాను సైతం ఉపయోగించుకోవచ్చట. ప్రపంచ జనాభాలో 85 శాతం మంది నివసించే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు ఉన్నా.. ఇంటర్నెట్ మాత్రం 30 శాతం మంది నివసించే చోట్ల మాత్రమే ఉందని, అందుకే అందరికీ ఇంటర్నెట్‌ను అందించేందుకే ఈ ఆప్‌ను రూపొందించినట్లు ఫేస్‌బుక్ వర్గాలు వెల్లడించాయి. బాగుందే. వెంటనే డౌన్‌లోడ్ చేసేసుకుందాం.. అనుకుంటున్నారా? కానీ ఇప్పుడే కుదరదులెండి. ప్రస్తుతం ఈ ఆప్ జాంబియా దేశంలోని ఎయిర్‌టెల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దశలవారీగా మిగతా అన్ని దేశాల్లోనూ విడుదల చేస్తారట.