ముంబై:అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత భారత్‌లో వాహనాల తయారీకి ప్రతికూలంగా మారుతోంది. దీంతో ఆగస్టు–సెప్టెంబర్ హోల్‌సేల్ అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది.
‘మారుతి, బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి కంపెనీలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ప్రభావం ఉండవచ్చు‘ అని వివరించింది. మలేషియాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ కూడా చిప్‌ల కొరతకు కారణంగా ఉంటోందని జెఫ్రీస్ తెలిపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితులు ఆటోమొబైల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి.
చదవండి : ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది!
విరివిగా సెమీకండక్టర్ల వినియోగం..
వాహనాలు మొదలుకుని కంప్యూటర్లు, సెల్‌ఫోన్లతో పాటు ఇతరత్రా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో సెమీకండక్టర్లుగా వ్యవహరించే సిలికాన్ చిప్‌లను వాడుతున్నారు. ఆయా ఉత్పత్తులు వివిధ పనులను సక్రమంగా నిర్వర్తించేందుకు (కంట్రోల్, మెమొరీ మొదలైనవి) చిప్‌లు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో కొత్త వాహనాల రూపకల్పనలో సెమీకండక్టర్ల వాడకం గణనీయంగా పెరిగింది. కీలకమైన చిప్‌లకు కొరత నెలకొనడంతో అంతర్జాతీయంగా ఆటోమోటివ్ సహా ఇతర పరిశ్రమలపైనా ప్రభావం పడుతోంది. దీంతో అవి ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
నివేదికలోని ఇతర వివరాలు..
2019 ఆగస్టుతో (కరోనాకి పూర్వం) పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ 41–44 శాతం పెరిగింది. ట్రక్కుల రిజిస్ట్రేషన్ 15 శాతం తగ్గినప్పటికీ క్రమంగా మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం ఆగస్టులో ఏకంగా 19 శాతం పడిపోయాయి.
►2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 29 శాతం తగ్గాయి. కోవిడ్ సెకండ్ వేవ్ పరిణామాలు ఇందుకు కారణం. డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. జులై ద్వితీయార్థంలో ఆటోమొబైల్ కంపెనీల కోసం ఆన్‌లైన్‌లో సెర్చి చేయడం కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్లీ పెరుగుతోంది. కన్జూమర్ సెంటిమెంట్ మెరుగుపడుతోందనడానికి ఇది నిదర్శనంగా జెఫ్రీస్ తెలిపింది.
►ఇక 2019తో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టూవీలర్ల రిజిస్ట్రేషన్లు 46 శాతం పడిపోయినప్పటికీ క్రమంగా డిమాండ్ పెరుగుతోంది.
►జులై–ఆగస్టు మధ్య కాలంలో ట్రాక్టర్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 2019తో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ట్రక్కులకు కూడా డిమాండ్ పెరుగుతోంది.
►ఆటోమొబైల్ కంపెనీల స్థూల మార్జిన్ ఒత్తిళ్లలో అత్యధిక భాగం సెప్టెంబర్ త్రైమాసికానికి తగ్గిపోవచ్చని జెఫ్రీస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంపెనీలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన మెరుగైన మార్జిన్లు నమోదు చేసుకోవచ్చని వివరించింది.
సెప్టెంబర్‌లో మారుతీ ఉత్పత్తి డౌన్..?
చిప్‌ల కొరత కారణంగా సాధారణ స్థాయితో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉత్పత్తి 40 శాతానికి తగ్గిపోవచ్చని దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. హర్యానా, గుజరాత్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రభావం పడవచ్చని సంస్థ తెలిపింది. హర్యానాలోని గుర్గావ్, మానెసర్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 15 లక్షల యూనిట్లుగా ఉంది. దీంతో పాటు గుజరా త్‌లోని సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్‌ఎంజీ) ప్లాంటు స్థాపిత సామర్థ్యం వార్షికంగా మరో 7.5 లక్షల యూనిట్ల స్థాయిలో ఉంది. జులైలో మారుతీ సుజుకీ మొత్తం ఉత్పత్తి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment