
న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని గతవారంలో మార్కెట్ వర్గాలు ఆందోళన చెందగా.. వారాంతాన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై వెనక్కి తగ్గినట్లు ప్రకటించి ఊరటనిచ్చారు. అయితే, ఇప్పటికీ ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఈ నెల 28–29 తేదీల్లో జపాన్‌లోని ఒసాకాలో జి–20 శిఖరాగ్ర సమావేశాలు జరగనుండగా.. ఈ సదస్సులో పాల్గొనే పలు దేశాలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని మార్కెట్ పండితులు భావిస్తున్నాయి. అమెరికా–చైనా వాణిజ్య చర్చలకు ఈ సమావేశం వేదిక కానుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఇక బడ్జెట్ విధానాలపై ఊహాగానాలు, అంతర్జాతీయ అంశాలే ఈవారంలో మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య చర్చలు ఈవారంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయని రెలిగేర్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ పేర్కొన్నారు. వీటితోపాటు ముడిచమురు ధరల కదలికలు, రుతుపవనాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నటువంటి దేశీ అంశాలని కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు సంజీవ్ అన్నారు.
ఒడిదుడుకులకు ఆస్కారం..
జూన్ సిరీస్ డెరివేటీవ్ పొజిషన్లు గురువారం ముగియనుండగా.. జూలై సిరీస్‌కు రోల్ ఓవర్లు జరిగే క్రమంలో ఈవారంలో అధికస్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉంది. ఆప్షన్ డేటా ప్రకారం తక్షణ ట్రేడింగ్ రేంజ్ 11,600 నుంచి 11,900 రేంజ్‌లో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘నిఫ్టీ 2018లో నమోదుచేసిన 11,750 స్థాయిలో కన్సాలిడేట్ అవుతోంది. జూన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ముగింపు వరకు ఇది కొనసాగేందుకు అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం) కాల్, పుట్ ఆప్షన్ రైటింగ్ ఆధారంగా ఈస్థాయిలోనే కదలాడేందుకు అవకాశం ఉంది’ అని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అమిత్ గుప్తా విశ్లేషించారు.
ముడిచమురు ధరల ప్రభావం..
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కారణంగా గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5 శాతం ర్యాలీ చేసి 65 డాలర్లకు చేరుకుంది. అయితే, ప్రస్తుతానికి అమెరికా వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఈవారంలో ధరలు కాస్త చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయని కమోడిటీ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరివరకు ఒపెక్ ఉత్పత్తి కోతకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఆనంద్ రాఠీ స్టాక్ బ్రోకర్స్ విశ్లేషకులు రుషాబ్ మేరు అన్నారు.
స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి
మేనెల ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా శుక్రవారం విడుదల కానున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అంశాల్లో.. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన ద్రవ్య విధాన సమావేశ మినిట్స్‌ను వెల్లడించనుంది.
కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ
భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలి యో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్న వీరు.. ఈనెల్లో ఇప్పటివరకు రూ.10,312 కోట్లను పెట్టుబడిపెట్టారు. జూన్ 3–21 కాలంలో ఈక్విటీ మార్కెట్‌లో రూ.552 కోట్లు, డెట్ మార్కెట్‌లో రూ.9,761 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది.
82,619 కోట్లకు పీ–నోట్స్ పెట్టుబడులు
దేశీయ క్యాపిటల్ మార్కెట్‌లోకి పీ–నోట్లు (పార్టిసిపేటరీ నోట్స్) ద్వారా వచ్చే పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మే నెల చివరినాటికి 1,400 పెరిగి 1.72 శాతం వృద్ధిని నమోదుచేశాయి. అంతకుముందు ఏప్రిల్ నెల చివరినాటికి ఈ తరహా పెట్టుబడులు రూ.81,220 కోట్లు కాగా, మే నెల చివరినాటికి రూ.82,619 కోట్లకు చేరినట్లు సెబీ తాజా సమాచారంలో వెల్లడయింది.