ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఐఫోన్ ఎక్స్ అనే స్పెషల్ ఫోన్‌తో పాటు వీటిని కూడా ఆపిల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్ ఎక్స్‌తో పాటు ఈ రెండు ఐఫోన్లు కూడా చాలా ఖరీదైనవి. ధర పరంగే కాక, తయారీ విషయంలోనూ ఈ ఫోన్లు చాలా ఖర్చుతో కూడుకున్నవని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిని తయారుచేయడానికి ఆపిల్ భారీ ఎత్తున్న ఖర్చు చేసినట్టు పేర్కొన్నాయి.మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్ అధ్యయన రిపోర్టు ప్రకారం ఐఫోన్ ఖర్చుగా ఆపిల్ 247.51 డాలర్లను, ఐఫోన్ 8 ప్లస్ ఖర్చుగా 288.08 డాలర్లుగా వెచ్చించినట్టు తెలిసింది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం ఐఫోన్ 8 తయారీ కోసం సుమారు రూ.16వేలు, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కోసం రూ.19వేలను ఖర్చుచేసినట్టు వెల్లడైంది. ఇది కేవలం ఈ కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ వెచ్చించిన ఖర్చులో సగ భాగం మాత్రమేనని తెలిపింది. ప్రస్తుత అధ్యయనంలో లేబర్, మార్కెటింగ్, రీసెర్చ్ వ్యయాలను కలుపలేదు. పాపులర్ హై-ఎండ్ ఫోన్ల తయారీ ఖర్చుపై ఈ అధ్యయనాన్ని ప్రతేడాది మార్కిట్ రీసెర్చ్ చేపడుతోంది.
ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.64వేల నుంచి ఆపిల్ విక్రయిస్తుండగా... ఐఫోన్ 8 ప్లస్ ధర రూ.73వేలు ఉంది. గ్లోబల్ మార్కెట్‌లలో అమ్మకానికి వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ప్రీ-బుకింగ్‌లు భారత్‌లో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి ఇవి విక్రయానికి వస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్ కూడా భారత్‌లో నవంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89వేలు. అయితే ఐఫోన్ ఎక్స్ తయారీ ఖర్చును మాత్రం ఐహెచ్‌ఎస్ గణించలేదు. ఐఫోన్ ఎక్స్ తయారీ కోసం ఆపిల్ భారీ మొత్తంలో ఖర్చు చేసి ఉంటుందని మాత్రం ఐహెచ్‌ఎస్ మార్కిట్ చెప్పింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనావేస్తోంది. అంతకముందు ఐహెచ్‌ఎస్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్8 మొత్తం తయారీ ఖర్చు 307 డాలర్లు.