సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లావాదేవీలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో ఇప్పటికే ఐఆర్‌సీటీసీ ఈ వాలెట్‌ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా థర్డ్ పార్టీ పేమెంట్ సంస్థలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తద్వారా ప్రస్తుతం నెలకు 1.2మిలియన్లకు పైగా టికెట్లను విక్రయిస్తున్నసంస్థ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఆదాయంతోపాటు భారీ లావాదేవీల ద్వారా అధిక మొత్తంలో వచ్చే తక్షణ ఆదాయాలపై ఐఆర్‌సీటీసీ కన్నేసింది. ఈ నేపథ్యంలోనే సొంత పేమెంట్ గేట్‌వేను ప్రారంభించనుంది. తద్వారా థర్ట్ పార్టీ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ప్రాథమికంగా ఈ పేమెంట్ గేట్‌వేకు ‘ఐపే’గా పిలుస్తోందట. రాబోయే 4-8 వారాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించనుంది. పరీక్ష విజయవంతమైన అనంతరం దీన్ని దశలవారీగా అన్ని ప్లాట్‌ఫాంలలోనూ అమల్లోకి తీసుకురానుంది. తద్వారా ప్రస్తుతం రేజర్, మొబీక్విక్, పేటిఎం లాంటి సంస్థకు గట్టి షాక్ ఇవ్వనుంది. ఈ సంస్థలకు గేట్‌వేల ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ లావాదేవీలకు భారీగా గండిపడనుంది.
కాగా ఐఆర్‌సీటీసీ 2016-2017 వార్షిక నివేదిక ప్రకారం 573,000 ఇ-టికెట్లను రోజువారీ విక్రయిస్తోంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు పేటీఎం, రేజర్ రెండూ నిరాకరించాయి. అటు సొంత పేమెంట్ గేట్‌వే ఆవిష్కరణపై ఐఆర్‌సీటీసీ అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment