
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ కార్యకలాపాలు రెండు గంటలపాటు స్థంభించనున్నాయి. రోజువారీ సైట్ నిర్వహణలో భాగంగా రెండు గంటలపాటు టికెట్ బుకింగ్స్ నిలిచిపోనున్నాయని భారతీయ రైల్వేశాఖ వెల్లడించింది. నవంబరు10, 2018 రోజున 00.20 గంటల నుంచి 01.30 గంటల వరకు రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం, ఎంక్వయిరీ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ (irctc.co.in) సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవనీ, రెండు గంటల సమయంలో ఇంటర్నెట్ బుకింగ్, ఫోన్ సర్వీసులు, కీలక సర్వీసులు సైతం నిలిచిపోనున్నట్టు పేర్కొంది. దీన్ని రైల్వే వినియోగదారులకు గుర్తించాలని కోరింది.
రైల్వే టికెట్ బుకింగ్, టికెట్ రద్దు చేసుకునే సౌకర్యం వెబ్‌సైట్ నిర్వహణ కారణంగా నవంబరు 10వ తేదీ 00:20 నుంచి 01:30 గంటలు వరకు అందుబాటులో ఉండదు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో రిజర్వేషన్ కార్యకలాపాలు, ఇంటర్నెట్ బుకింగ్, ఎంక్వైరీ సర్వీసులు (టెలిఫోన్ నెంబర్ 139) కూడా పనిచేయవని ఐఆర్‌సీటీసీ తెలిపింది. సాధారణంగా ప్రతిరోజు వెబ్‌సైట్ నిర్వహణ పనులు 23:30 గంటల నుంచి 00:30 గంటల మధ్యలో జరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండదు.