స్వల్పకాలానికి పసిడి పటిష్టం: నిపుణులు
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి, క్రూడ్ ఆయిల్ పతనం, అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగుదలపై భారీగా లేని ఆశలు... దీనితో ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరగదన్న అంచనాలు.. వెరసి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ధర రానున్న కొద్ది కాలంలో పటిష్ట ధోరణిలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
లాభాల స్వీకరణ...: అంతర్జాతీయంగా నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర అంతక్రితం వారంతో పోల్చితే... స్వల్పంగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం లాభాల స్వీకరణ అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
వరుసగా ఇక్కడ మార్కెట్లో నాలుగు వారాల నుంచి లాభపడుతూ వచ్చింది. వారం వారీగా ఔన్స్ (31.1గ్రా) ధర 9 డాలర్లు తగ్గి, 1,231 వద్ద ముగిసింది. వెండి కూడా స్వల్పంగా తగ్గినా... ఔన్స్‌కు 15 డాలర్ల ఎగువగానే ట్రేడవుతోంది. అంతర్జాతీయ ధోరణిని ప్రతిబింబిస్తూ... ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గత శుక్రవారం అంతక్రితం వారం ఇదే రోజుతో పోలిస్తే స్వల్పంగా రూ.170 తగ్గి, రూ.29,095 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,945 వద్దకు చేరింది. అంతక్రితం వారం పసిడి 10 గ్రాములకు భారీగా దాదాపు రూ.1,700 పెరిగిన సంగతి తెలిసిందే.