లేఆఫ్స్‌పై లేబర్ కోర్టును ఆశ్రయించిన టెకీలు
సాక్షి, బెంగుళూరు: టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల ఫోరం 11 వివాదాలకు సంబంధించి లేబర్ కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. బాధిత ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2 ఏ కింద పిటిషన్లు వేశారని ఫోరం కో-ఆర్డినేటర్ ఇలవరసన్ రాజా తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ఏ ఉద్యోగినైనా సంస్థ తొలగించిన పక్షంలో దాన్ని పారిశ్రామిక వివాదంగా పరిగణిస్తారు.
కాగా దీనిపై స్పందించిన టెక్ మహీంద్ర న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. గతంలో ఓ ఉద్యోగిని బలవంతంగా తొలగించేలా కంపెనీ హెచ్‌ఆర్ అధికారులు వ్యవహరించిన ఆడియో క్లిప్‌లు వెలుగు చూడటంతో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా క్షమాపణలు వేడుకున్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగిస్తున్నాయి. విప్రో, కాగ్నిజెంట్ సహా పలు ఐటీ కంపెనీలు సామర్థ్య మదింపు పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.