
అపోలో హాస్పిటల్స్‌లో ఐటీ శాఖ సోదాలు
* ప్రమోటర్ల ఇళ్లలోనూ తనిఖీలు
* సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్స్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ మంగ ళవారం తనిఖీలు నిర్వహించింది. ఏవైనా పన్ను ఎగవేత జరిగిందో లేదో నిర్ధారించుకోవడానికి ఈ దాడులు చేపట్టినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి జరిగిన దాడుల్లో 50 బృందాలు పాల్గొన్నాయి. సంస్థ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డితోసహా కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.
కంపెనీ వ్యాపారం, రోగుల సేవలకు చెందిన పత్రాలను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఐటీ శాఖ తనిఖీలు చేపట్టడం 33 ఏళ్ల అపోలో చరిత్రలో ఇదే తొలిసారి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతోపాటు ఇతర నగరాల్లోని అపోలో కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. జూబ్లీహిల్స్‌లోని ఆసుప్రతిలో రెండు బ్లాక్‌లను అధికారులు మూసివేసి దాడులు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలను నిలుపుదల చేశారు. అదే సమయంలో చెన్నై, న్యూఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ బ్లాక్‌లను మూసివేశారు. అయితే సాధారణ కార్యకలాపాలను ఎటువంటి అడ్డంకులు కలుగలేదు.
తనిఖీల విషయాన్ని అపోలో ధ్రువీకరించింది. ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందించామని వెల్లడించింది. అంతర్గతంగా తాము నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, రోగులు, వాటాదారుల నమ్మకాన్ని కొనసాగిస్తామని తిరిగి హామీ ఇస్తున్నట్టు తెలిపింది. ఐటీ దాడుల నేపథ్యంలో ఒకానొక దశలో అపోలో హాస్పిటల్స్ షేరు ధర బీఎస్‌ఈలో రూ.1,497 వరకు వెళ్లి రూ.1,431.55లకు వచ్చి చేరింది. చివరకు రూ.1,466.75 వద్ద స్థిరపడింది.