సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ మూడో త్రైమాసికం(మార్చి-మే)లో అంచనాలను మించిన ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ రంగ కౌంటర్లకు ఒక్కసారిగా ఉత్సాహమొచ్చింది. ఫలితంగా సాఫ్ట్‌వేర్ సేవల రంగంలోని దాదాపు అన్ని కౌంటర్లకూ డిమాండ్ పెరిగింది. దీంతో ఎన్ఎస్‌ఈలో ప్రస్తుతం ఐటీ ఇండెక్స్ ఏకంగా 4.5 శాతం జంప్‌చేసింది. దాదాపు అన్ని ఐటీ కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో బ్లూచిప్స్‌తోపాటు మిడ్ క్యాప్స్ సైతం భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
జోరు తీరిలా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్ 6.5 శాతం ఎగసి రూ. 747ను తాకగా.. టీసీఎస్ 5 శాతం జంప్‌చేసి రూ. 2113కు చరింది. విప్రో 4 శాతం లాభపడి రూ. 227 వద్ద, టెక్ మహీంద్రా 2.3 శాతం పుంజుకుని రూ. 567 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3 శాతం పురోగమించి రూ. 566కు చేరింది.
రయ్‌రయ్
మిడ్ సైజ్ కంపెనీ కౌంటర్లలో నిట్ టెక్ 8 శాతం పెరిగి రూ. 1491కు చేరగా.. మైండ్‌ట్రీ 6 శాతం జంప్‌చేసి రూ. 972ను తాకింది. ఈ బాటలో ఎంఫసిస్ 4 శాతం బలపడి రూ. 906 వద్ద, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ 4.2 శాతం ఎగసి రూ. 1314 వద్ద, ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫోటెక్ 2 శాతం లాభంతో రూ. 1927 వద్ద కదులుతున్నాయి.
క్యూ4 భళా
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ మేతో ముగిసిన తాజా క్వార్టర్లో 125 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 1.9 డాలర్ల షేరువారీ ఆర్జన(ఈపీఎస్)కాగా.. మొత్తం ఆదాయం 11 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో కంపెనీ 62.7 కోట్ల డాలర్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది. క్యూ4లో 10.6-11 బిలియన్ డాలర్ల ఆదాయం అంచనా(గైడెన్స్) వేస్తోంది. పూర్తి ఏడాదికి 7.7 ఈపీఎస్‌ను సాధించగలమని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment