ఐటీసీ లాభం రూ.2,653 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి స్వల్పంగా వృద్ధి చెందింది. గత క్యూ3లో రూ.2,635 కోట్లుగా ఉన్న నికరలాభం(స్డాండోలోన్) ఈ క్యూ3 లో 2,653 కోట్లకు పెరిగిందని ఐటీసీ తెలిపింది. సిగరెట్ల వ్యాపారంపై ఒత్తిడి కొనసాగుతుండడం, ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్లో డిమాండ్ మందగించడం, వ్యవసాయ కమోడిటీల్లో వ్యాపార అవకాశాల్లేకపోవడం దీనికి కారణాలని కంపెనీ పేర్కొంది. నికర అమ్మకాలు రూ.8,800 కోట్ల నుంచి 3% వృద్ధితో రూ.9,103 కోట్లకు ఎగసినట్లు వివరించింది.
తగ్గిన వ్యవసాయ వ్యాపారం
గత క్యూ3లో రూ.6,456 కోట్లుగా ఉన్న సిగరెట్లతో సహా ఎఫ్‌ఎంసీజీ వ్యాపార ఆదాయం ఈ క్యూ3లో 6 శాతం వృద్ధితో రూ.6,858 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ల వ్యాపారం రూ.4,142 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.4,380 కోట్లకు పెరిగిందని వివరించింది. అధిక పన్నులు, కేంద్రం నిబంధనలు.. సిగరెట్ల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది.
ఎఫ్‌ఎంసీజీ విభాగం రూ.2,314 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.2,478 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డిమాండ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉండడం, చెన్నై వరదల కారణంగా సరఫరాలు అతలాకుతలమవడం వల్ల ఎఫ్‌ఎంసీజీ విభాగ ఆదాయం దెబ్బతిన్నదని వివరించింది. హోటల్ వ్యాపారం రూ.330 కోట్ల నుంచి 4.5 శాతం వృద్ధితో రూ.345 కోట్లకు పెరిగిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్‌ఈలో 0.6 శాతం లాభపడి రూ.308 వద్ద ముగిసింది.