ఐటీసీ లాభం 2,385 కోట్లు క్యూ1లో 10 శాతం వృద్ధి
ఆదాయం 8 శాతం అప్; రూ.13,157 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో (2016-17, క్యూ1) స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,385 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే కాలంలో లాభం రూ.2,166 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 8.3 శాతం వృద్ధితో రూ. 12,233 కోట్ల నుంచి రూ.13,253 కోట్లకు పెరిగింది. వ్యాపారంలో పలు సవాళ్లు, ఎఫ్‌ఎంసీజీ రంగంలో డిమాండ్ మందగమనం, సిగరెట్ల పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణల ప్రభావం ఉన్నప్పటికీ స్థిరమైన పురోగతిని సాధించినట్లు ఐటీసీ పేర్కొంది. కంపెనీకి ప్రధాన ఆదాయ వనరైన సిగరెట్ల వ్యాపారం ఆదాయం క్యూ1లో రూ. 8,231 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ ఆదాయం రూ. 7,734 కోట్లతో పోలిస్తే 6.4 శాతం వృద్ధి చెందింది. ఇతర విభాగాలను చూస్తే...
⇒ సిగరెట్లు సహా మొత్తం ఎఫ్‌ఎంసీజీ, ఇతరత్రా విభాగాల ఆదాయం క్యూ1లో 9.5 శాతం పెరిగి రూ. 2,385 కోట్లుగా నమోదైంది.
⇒ హోటళ్ల వ్యాపార ఆదాయం మాత్రం స్వల్పంగా 0.16 శాతం తగ్గి రూ. 287 కోట్లకు పరిమితమైంది.
⇒ అగ్రి బిజినెస్ ఆదాయం 20.15 శాతం ఎగసి రూ. రూ.2,325 కోట్ల నుంచి రూ. 2,794 కోట్లకు వృద్ధి చెందింది.
⇒ పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపార ఆదాయం 1.57 శాతం క్షీణించి రూ. 1,322 కోట్లకు తగ్గింది.
⇒ ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్‌ఈలో ఐటీసీ షేరు స్వల్ప నష్టంతో రూ.251 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
సీఈఓగా దేవేశ్వర్‌కు చివరి ఏజీఎం..
ఐటీసీ 105వ వాటాదారుల వార్షిక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనుంది. ప్రస్తుతం కంపెనీ చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్న యోగేష్ చందర్ దేవేశ్వర్ చివరిసారిగా సీఈఓ హోదాలో ఏజీఎంలో మాట్లాడనున్నారు. సీఈఓగా ఆయన పదవీకాలం 2017 ఫిబ్రవరి 4తో పూర్తికానుంది. యువతరానికి అవకాశమివ్వటం కోసం మరోవిడత సీఈఓ బాధ్యతలను చేపట్టకూడదని యోగేశ్వర్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే, చైర్మన్‌గా మాత్రం ఆయన కొనసాగుతారు. సిగరెట్ల వ్యాపారమే ప్రధానంగా కొనసాగుతున్న తరుణంలో 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వచ్చిన యోగేశ్వర్... విభిన్న రంగాల్లోకి కంపెనీని విస్తరించి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజంగా మార్చారు. ఆయన సారథ్యం చేపట్టేనాటికి ఐటీసీ వార్షికాదాయం రూ.5,200 కోట్లు కాగా, ఇప్పుడు రూ.50 వేల కోట్లకు చేరింది. ఇక వార్షిక స్థూల లాభం రూ.452 కోట్ల నుంచి 33 రెట్లు ఎగబాకి రూ.14,958 కోట్లకు పెరిగింది.