రూపాయి ర్యాలీ ముగిసిందా?
ఇకపై ఒక మోస్తరు లాభాలే
ఎకానమీ ఇంకా పుంజుకోకపోవడమే కారణం
కరెన్సీ నిపుణుల అంచనా
బెంగళూరు: ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి నుంచి బలపడుతూ వచ్చిన రూపాయి ర్యాలీ ఇక ముగిసినట్లేనా? దాదాపుగా అయిపోయిందనే అంటున్నారు నిపుణులు. రాబోయే పన్నెండు నెలల కాలంలో రూపాయి ఒక మోస్తరు లాభాలు మాత్రమే నమోదు చేయొచ్చని లెక్కలు కడుతున్నారు. ఎకానమీ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. కొత్త ప్రభుత్వం, కరెంటు అకౌంటు లోటు దిగి వస్తుండటం వంటి సానుకూలాంశాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని చెబుతున్నారు.
గతేడాది ఆల్‌టైమ్ కనిష్టమైన 68 స్థాయికి పడిపోయిన రూపాయి.. ఈ ఏడాది మాత్రం వర్ధమాన దేశాల కరెన్సీల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చిన వాటిల్లో ఒకటిగా కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే జనవరి నుంచి సుమారు 4 శాతం మేర బలపడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు తర్వాత మే 22న ఏడాది గరిష్టమైన 58.25 స్థాయిని కూడా తాకింది. గత నెలలో ఏకంగా రూ. 33,700 కోట్ల మేర విదేశీ నిధులు.. దేశీ స్టాక్‌మార్కెట్లు, బాండ్లలోకి ప్రవహించాయి. స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్టాలకు ఎగిశాయి. ఎన్నికల తర్వాత పరిస్థితులపై ఆశావహ ధోరణి కారణంగా ఈక్విటీలు, బాండ్లలోకి మే లో నిధులు వెల్లువెత్తడం రూపాయి బలపడటానికి దోహదపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లోకి కనీసం 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడంపై సమాలోచనలతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటిదాకా అన్నీ సానుకూల సంకేతాలు పంపారని వారు పేర్కొన్నారు.
రక్షణ సహా వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితులను పెంచడం, ఇతరత్రా కీలక ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం వంటి విషయాల్లో కేంద్రం వేగవంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంచనాలు నెలకొన్నాయి. కొత్త ప్రభుత్వ విధానాలు ఎలా ఉండబోతున్నాయనేది వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ ద్వారా ఒక అవగాహన రావొచ్చు. రూపాయి పాలిట కొన్ని ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. వృద్ధి ఇంకా పుంజుకోకపోవడం ఇందులో ఒకటి. జనవరి-మార్చి త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి 4.6 శాతం మాత్రమే నమోదైంది. ఇక ఈ ఏడాది ఆఖరు నాటికి ఆర్థిక ప్యాకేజీల ఉపసంహరణ పూర్తి చేసే దిశగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వేస్తున్న అడుగులు కూడా రూపాయిని వెనక్కి లాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 2-5 మధ్య జరిపిన సర్వే ప్రకారం రూపాయి విలువ 3 నెలల వ్యవధిలో 59.20 స్థాయిలో, ఏడాది వ్యవధిలో 60.16 స్థాయిలో ఉండగలదని పేర్కొన్నారు.
దేశీ కరెన్సీ 16 పైసలు అప్..: ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు ఎగిసింది. 59.17 వద్ద ముగిసింది. పక్షం రోజుల్లో ఇది అత్యధిక పెరుగుదల. దేశీ ఈక్విటీ మార్కెట్లు దూసుకెడుతుండటం, భారీగా పెట్టుబడులు వస్తుండటం రూపాయి పెరుగుదలకు తోడ్పడ్డాయి.