తండ్రితో పాటు జామియా విద్యార్థి మహమ్మద్ ఆమీర్ అలీ
ఒక సాదాసీదా ఎలక్ట్రిషియన్ కొడుకు... అప్పటికే మూడు సార్లు అనుకున్న లక్ష్యం విఫలమైంది. అయినప్పటికీ ఎక్కడా కూడా పట్టు వదలలేదు. ఎలాగైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలని నిరంతరం శ్రమించాడు. ఎట్టకేలకు ఆ విద్యార్థి చెంతకే ఓ అమెరికన్ కంపెనీ వచ్చి వాలింది. ఆ విద్యార్థిని వదులుకోలేక భారీ ప్యాకేజీతో తన కంపెనీలోకి నియమించుకుంది. ఆ విద్యార్థే జామియా మిల్లియా ఇస్లామియా(జేఎంఐ)కు చెందిన మహమ్మద్ ఆమీర్ అలీ. అతడి స్టోరీ యువతరానికి స్ఫూర్తిదాయకం.
జేఎంఐ స్కూల్ బోర్డు పరీక్షల్లో అలీ మంచి మార్కులు సంపాదించాడు. కానీ మూడేళ్ల పాటు బీటెక్ కోర్స్‌లో సీటే దొరకలేదు. తొలి ప్రయత్నంలో నిరాశ. ఆ తర్వాత రెండు సార్లు విఫలమే. అయినప్పటికీ ఎక్కడ కూడా పట్టువిడవలేదు. మూడు సార్లు విఫలమనంతరం అలీ ఆశలకు కాస్త ఊరటనిస్తూ.. జేఎంఐలో డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ అర్హత లభించింది. అప్పటికే పలుమార్లు విఫలమైన అనంతరం జేఎంఐలో సీటు దక్కించుకున్న అలీ.. నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా సాధించాలనుకున్నాడు. భవిష్యత్తు తరం వారికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రాజెక్ట్ వర్క్‌చేయడం ప్రారంభించాడు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు సరియైన ఛార్జింగ్ సదుపాయాలు లేవు. వీటిపై ఎక్కువగా దృష్టిసారించాడు అలీ. ఒకవేళ అలీ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ను అమెరికా కంపెనీ ఫ్రిసన్ మోటార్ వ్రెక్స్ గుర్తించింది. జేఎంఐ వెబ్‌సైట్‌లో ఈ ప్రాజెక్ట్ వర్క్‌ను చూసిన ఫ్రిసన్ వెంటనే యూనివర్సిటీ అధికారులను సంప్రదించింది. స్కైప్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూల ద్వారా నెల పాటు అలీతో నిరంతరం కమ్యూనికేషన్ జరిపిన ఫ్రిసన్.. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా తన కంపెనీలోకి నియమించుకుంది. వేతనం ఎంత అనుకుంటున్నారు? వింటే మీరే ఆశ్చర్యపోతారు. 1,00,008 డాలర్లు అంటే సుమారు 70 లక్షల రూపాయలన్నమాట. ఒక జామియా విద్యార్థికి ఈ మేర వేతనంతో ఉద్యోగం దొరకడం ఇదే తొలిసారి. జేఎంఐ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీ అని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అలీ తండ్రి శంషాద్ అలీ జేఎంఐలోనే ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఎలక్ట్రిక్ పరికరాలు ఎలా పనిచేస్తాయని తనను చాలాసార్లు అలీ అడుగుతుండే వాడని శంషాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment