
ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి..
ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం కట్టడిపై కేంద్రం ప్రధానంగా దృష్టి ....
న్యూఢిల్లీ: ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం కట్టడిపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా సోమవారం పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2015-16లో దేశం 6 నుంచి 6.5 శ్రేణిలో వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే జయంత్ సిన్హా.
వచ్చే రెండేళ్లలో రికవరీ: మూడీస్
ఇదిలావుండగా, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ లండన్‌లో తన త్రైమాసిక గ్లోబల్ మైక్రో అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. వచ్చే రెండేళ్లలో భారత్ మంచి ఆర్థిక వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని ఈ నివేదిక వ్యక్తంచేసింది. అమెరికా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలు కూడా మెరుగుపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. మూడీస్ అంచనాల ప్రకారం 2014లో భారత్ వృద్ధి 5 శాతం. 2015లో మరింత పెరిగే అవకాశం ఉంది.
రేటు తగ్గింపు అవకాశం: సిటీగ్రూప్: కాగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ తన పాలసీ రేటును ఒక శాతం వరకూ తగ్గించే అవకాశం ఉందని సిటీ బ్యాంక్ సోమవారం ఒక నివేదికలో తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఇందుకు దోహదపడే ప్రధానాంశమని సిటీగ్రూప్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ రోహినీ మల్కానీ పేర్కొన్నారు.