విమాన ప్రయాణాలకు డిస్కౌంట్ ఆఫర్లు
ఆకర్షణీయంగా జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఏషియా ఆఫర్లు
న్యూఢిల్లీ: విమానయానసంస్థల మధ్య ధరల పోరు జరుగుతోంది. పలు దేశీయ విమానయాన సంస్థలు విమాన టికెట్లపై డిస్కౌంట్లను ప్రకటిం చాయి. ఈ ఆఫర్లు తక్కువలో తక్కువ రూ.999 నుంచి ఉన్నాయి.
జెట్, ఎయిర్ ఏషియాల ఆఫర్లు..
జెట్ ఎయిర్‌వేస్ సంస్థ స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్లు రూ.999 నుంచి ప్రారంభమవుతాయని, దేశీయ రూట్లలో అయితే ఈ నెల 29లోపు, అంతర్జాతీయ రూట్లలో అయితే ఈ నెల 27లోపు టికెట్లను బుక్ చేసుకోవాలని పేర్కొంది. దేశీయ రూట్లలో ప్రయాణాలను బుక్ చేసుకున్న 15 రోజల తర్వాత అనుమతిస్తామని, అంతర్జాతీయ రూట్లలో అయితే తక్షణం అనుమతిస్తామని పేర్కొంది. మరోవైపు ఎయిర్ ఏషియా కూడా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. రిటర్న్ ప్రయాణం టికెట్లలో 50 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఈ నెల 29 వరకూ బుక్ చేసుకోవలసి ఉంటుందని, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 లోపు ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.
ప్రయాణికులకు అవకాశం..
వేసవి సెలవుల్లో, ఈ ఏడాది వారాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పెంచుకోవడం లక్ష్యంగా పలు కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు విమానయానం చేసే ప్రయాణికులకు మంచి అవకాశమని యాత్రడాట్‌కామ్ ప్రెసిడెంట్ శరత ధల్ చెప్పారు. మరిన్ని కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటించే అవకాశాలున్నాయని, ఈ ఆఫర్ల పుణ్యమాని దేశీయ విమానయాన పరిశ్రమ వృద్ధి పెరుగుతుందని పేర్కొన్నారు.