ఔను.. జెట్‌ రేసులో ఉన్నాం! | Tata's National Service won't be enough to Save Jet Airways | Sakshi
Sakshi News home page

ఔను.. జెట్‌ రేసులో ఉన్నాం!

Published Sat, Nov 17 2018 12:31 AM | Last Updated on Sat, Nov 17 2018 8:21 AM

Tata's National Service won't be enough to Save Jet Airways - Sakshi

ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు సంబంధించి వస్తున్న వార్తలపై పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్‌ ఎట్టకేలకు స్పందించింది. దీనిపై చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తామింకా నిర్మాణాత్మకంగా ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదని స్పష్టంచేసింది. జెట్‌ టేకోవర్‌పై చర్చించేందుకు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్‌ ఈ విషయం వెల్లడించింది. తద్వారా జెట్‌ కొనుగోలుపై కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను అధికారికంగా ధృవీకరించినట్లయింది. ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ టేకోవర్‌పై టాటా సన్స్‌ ఆసక్తిగా ఉందంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినవస్తున్నాయి.

అయితే, ఈ అంశంపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే జరిగాయని స్పష్టం చేయదల్చుకున్నాం. నిర్దిష్ట ప్రతిపాదనేదీ మేం ఆఫర్‌ చేయలేదు‘ అని టాటా సన్స్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి జెట్‌ ఎయిర్‌వేస్‌ను టేకోవర్‌ చేసే విషయంపై శుక్రవారం బోర్డు సమావేశంలో టాటాలు సానుకూల నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాల నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగిందని, కంపెనీని కొనుగోలు చేసేలా టాటా సన్స్‌కు సూచనలు చేసిందన్న వార్తలు కూడా వచ్చినప్పటికీ కేంద్రం వాటిని తోసిపుచ్చింది.

గురువారం స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన వివరణలో కూడా టేకోవర్‌ వార్తలన్నీ ఊహాగానాలేనంటూ జెట్‌ ఎయిర్‌వేస్‌ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.  జెట్‌ ఎయిర్‌వేస్‌లో ప్రమోటరు, చైర్మన్‌ నరేష్‌ గోయల్, ఆయన కుటుంబానికి 51%, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు మరో 24% వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందికి జీ తాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతోంది. వరుసగా గత మూడు త్రైమాసికాల్లో భారీ నష్టాలు ప్రకటించింది. తాజా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల నష్టం నమోదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నరేష్‌ గోయల్‌ పూర్తిగా తప్పుకుని, నిర్ణయాధికారం పూర్తి గా తమదిగా ఉండే పక్షంలో మాత్రమే డీల్‌ కుదుర్చుకోవాలని టాటా సన్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

జెట్‌పై వ్యూహం..
జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసిన పక్షంలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యంలో దేశీయంగా ఏర్పాటు చేసిన విస్తార విమానయాన సంస్థలో భాగం చేయాలని టాటా గ్రూప్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విస్తారకు దేశీయంగా 22 విమానాలు, 3.8 శాతం మాత్రమే మార్కెట్‌ వాటా ఉంది. మరోవైపు, అనుబంధ సంస్థ జెట్‌లైట్‌తో కలిపి జెట్‌కు 124 విమానాలు, 15.8 శాతం మార్కెట్‌ వాటా ఉంది. దేశ, విదేశాల్లో 66 ప్రాంతాలకు విమాన సేవలు నిర్వహిస్తోంది.

అంతర్జాతీయ రూట్లలో విస్తార కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నా అందుకు సంబంధించిన అనుమ తులు మంజూరు కావడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జెట్‌ను కొనుగోలు చేసి విస్తారలో విలీనం చేస్తే.. నేరుగా విదేశీ రూట్లలో సర్వీసులు ప్రారంభించేందుకు వెసులుబాటు లభించే అవకాశం ఉంది. 2008లో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా విదేశీ రూట్లలో సర్వీసులు మొదలుపెట్టేందుకు ఇదే తరహాలో ఎయిర్‌ డెక్కన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  అప్పట్లో అయిదేళ్ల కార్యకలాపాలు పూర్తయితే గానీ దేశీ ఎయిర్‌లైన్స్‌కు విదేశీ రూట్లలో సేవలకు అర్హత లభించేది కాదు.


ఎయిర్‌ఏషియాకి ’టాటా’ ..
జెట్‌ ఎయిర్‌వేస్‌పై కన్నేసిన టాటా గ్రూప్‌.. ఏవియేషన్‌ వ్యాపారంలో మరో వెంచర్‌ నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌ ప్రస్తుతం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎస్‌ఐఏ)తో కలిసి విసార పేరుతో పూర్తి స్థాయి విమానయాన సంస్థను, మలేషియాకి చెందిన ఎయిర్‌ఏషియా బెర్హాద్‌తో కలిసి చౌక చార్జీల ఎయిర్‌ ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. ఎయిర్‌ఏషియా ఇండియా నుంచి వైదొలగాలని టాటా సన్స్‌ యోచిస్తున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.

ఒకవేళ జెట్‌ ఎయిర్‌వేస్‌ డీల్‌ సాకారమైతే దాన్ని విస్తారలో విలీనం చేసి మొత్తం మీద ఒక్క విమానయాన వెంచర్‌కే పరిమితం కావాలని భావిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం ఎయిర్‌ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు 49 శాతం, ఎయిర్‌ఏషియా బెర్హాద్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. కంపెనీకి 19 విమానాలు ఉన్నాయి. ఒకవైపున జెట్‌ ఎయిర్‌వేస్‌ టేకోవర్‌కు టాటా సన్స్‌ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎయిర్‌ఏషియా ఇండియా నుంచి తప్పుకోవడంపై కూడా చర్చలు ప్రాథమికంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది.  

అయితే, ఎయిర్‌ఏషియా ఇండియా పరిమాణం తక్కువగా ఉండటం, మందగతిన కార్యకలాపాల విస్తరణ, నష్టాలు, ఎయిర్‌ఏషియా గ్రూప్‌ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌.. ఇతర అధికారుల అనుమానాస్పద లావాదేవీలపై సీబీఐ విచారణ తదితర అంశాల కారణంగా కొనుగోలుదారును పట్టుకోవడం టాటాలకు కాస్త కష్టతరంగానే ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయంగా ఫెర్నాండెజ్‌ స్వయంగా తన వాటాలను అమ్మేసి వైదొలిగే అంశాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి.

‘తనమీద కేసులు దాఖలు కావడంతో భారత్‌లో వ్యాపారం చేయడం టోనీ ఫెర్నాండెజ్‌కు మరింత కష్టతరంగా మారుతోంది. దీంతో కంపెనీలో తన వాటాలను అమ్మేసే అవకాశాలను ఆయన పరిశీలించవచ్చు. అయితే, ఒకవేళ తాను వైదొలగాలని అనుకుంటే.. విమానయాన సంస్థలో తన వాటాలకు మంచి గిట్టుబాటు రేటు వస్తే తప్ప ఆయన తప్పుకోరు‘ అని కంపెనీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

మరోవైపు, ఫెర్నాండెజ్‌ వాటాలను కొనుగోలు చేసి ఎయిర్‌ఏషియా ఇండియాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్నా టాటాలకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఇన్‌ఫ్రా, అకౌంటింగ్, రిజర్వేషన్‌ వ్యవస్థ మొదలైనవన్నీ ఎయిర్‌ఏషియా బెర్హాద్‌ లేదా దాని అనుబంధ సంస్థలు మలేషియా నుంచి నిర్వహిస్తుంటాయని, టాటాలకు కేవలం లైసెన్సు, స్లాట్స్‌ మాత్రమే దక్కుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

జెట్‌ షేరు జూమ్‌..
టాటా సన్స్‌ టేకోవర్‌ చేయొచ్చంటూ వస్తున్న వార్తలు జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరుకు గణనీయంగా లాభించాయి. గడిచిన అయిదు ట్రేడింగ్‌ సెషన్స్‌లో సంస్థ షేరు ఏకంగా 40 శాతం దూసుకెళ్లింది. టాటా సన్స్‌ బోర్డు సమావేశంలో టేకోవర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలతో శుక్రవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు బీఎస్‌ఈలో 14 శాతం గ్యాప్‌ అప్‌తో ప్రారంభమైంది. చివరికి 8 శాతం లాభంతో రూ. 346.85 వద్ద క్లోజయ్యింది. అటు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం పెరిగి రూ. 341 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.366.95 స్థాయిని కూడా తాకింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement