జెట్‌ రుణ సంక్షోభానికి తెర!  | Jet Airways Board Approves Lenders Rescue Package | Sakshi
Sakshi News home page

జెట్‌ రుణ సంక్షోభానికి తెర! 

Published Fri, Feb 15 2019 1:09 AM | Last Updated on Fri, Feb 15 2019 1:09 AM

Jet Airways Board Approves Lenders Rescue Package - Sakshi

ముంబై: నిధుల కటకట ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం రుణదాతలు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికకు కంపెనీ బోర్డు గురువారం ఆమోదముద్ర వేసింది. 2018 ఫిబ్రవరి 12 నాటి ఆర్‌బీఐ ఉత్తర్వుల మేరకు ఈ రుణ పరిష్కార ప్రణాళికను రూపొందించినట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలియజేసింది. తాజా ఈక్విటీ రూపంలో నిధులు అందించడం, ఇప్పటికే ఇచ్చిన రుణాలను పునరుద్ధరించడం, ఆస్తుల విక్రయం వంటివి ఈ ప్రణాళికలో భాగం. ఈ చర్యల అనంతరం బ్యాంకులో అతిపెద్ద వాటాదారులు రుణ దాతలే అవుతారు. రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చడం కింద... రూ.10 ముఖ విలువ కలిగిన 11.40 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. కాకపోతే పుస్తక విలువ ప్రతికూలంగా ఉన్నందున ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం షేరు ముఖ విలువను రూ.1 కింద పరిగణనలోకి తీసుకుంటారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ సుమారు రూ.8,500 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ఇందులో వచ్చే మార్చి నాటికే తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.1,700 కోట్లు. తన పనితీరు మెరుగుపరుచుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడం, నెట్‌వర్క్, సేవలకు సంబంధించిన వ్యాపార నమూనాలో మార్పుల వంటి చర్యలు కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ పరిష్కార ప్రణాళికకు ఈ నెల 21న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదాన్ని కంపెనీ కోరనుంది.

నష్టాలు రూ.732 కోట్లు
జెట్‌ ఎయిర్‌వేస్‌కి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.588 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన చూస్తే, గత క్యూ3లో రూ.186 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.732 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది.  

మొత్తం ఆదాయం రూ.6,148 కోట్లు.... 
కంపెనీ ఆదాయం రూ.6,086 కోట్ల నుంచి రూ.6,148 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు సైతం రూ.6,043 కోట్ల నుంచి రూ.6,786 కోట్లకు పెరిగాయి.  గత క్యూ3లో రూ.2,749 కోట్లుగా ఉన్న దేశీయ ఆదాయం ఈ క్యూ3లో రూ.2,560 కోట్లకు తగ్గిందని, అంతర్జాతీయ ఆదాయం కూడా రూ.3,337 కోట్ల నుంచి రూ.3,588 కోట్లకు తగ్గిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. 
ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 1 శాతం లాభంతో రూ.225 వద్ద ముగిసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement