
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ సమస్యలు పరిష్కారమవుతాయని పౌర విమానయాన శాఖ కొత్త మంత్రి హర్దీప్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగానికి సంబంధించి గతంలో కొన్ని తప్పులు చేశామని, ఇప్పుడు వాటిని సరిదిద్దాల్సిన అవసరముందని పేర్కొన్నారు. భారీ రుణాల కారణంగా సంక్షోభంలోకి కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌పై రెండో సారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం నుంచి వెలువడిన తొలి వ్యాఖ్య ఇది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సెమినార్‌లో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారీగా రుణాలు చేయడం, తీవ్రమైన పోటీతో ఒకప్పుడు ప్రైవేట్ రంగంలో అతి పెద్ద విమానయాన సంస్థగా వెలిగిన జెట్ ఎయిర్‌వేస్ ఇప్పుడు కార్యకలాపాలు నిలిపేసింది. ఫలితంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా విమాన చార్జీలు భారీగా పెరిగాయి. విమానయాన రంగం గడ్డు పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ శాఖకు కొత్త మంత్రిగా పురి బాధ్యతలు స్వీకరించారు. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ, ఎయిర్ ఇండియా విక్రయం గత ఏడాది విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సమస్యలను కొత్త మంత్రి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment