
జియో ఫీచర్ ఫోన్ ఉచితం: అంబానీ
ముంబై: వార్షిక సాధారణ సమావేశంలో ఆవిష్కరించిన జియో ఫీచర్ ఫోన్‌ను భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. అయితే వారు జియో ఖాతాదారులయి ఉండాలని చెప్పారు. ఫీచర్ ఫోన్ తీసుకునే వారు సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నగదును మూడేళ్ల అనంతరం (36 నెలల తర్వాత) కస్టమర్లకు రిఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబానీ ప్రకటించారు.
ఆగస్ట్ 24 నుంచి ఈ ఫీచర్ ఫోన్లు బుకింగ్స్ చేసుకోవచ్చునని చెప్పారు. అయితే సెప్టెంబర్ 1నుంచి జియో ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ జియో ఫోన్ వినియోగదారులకు వాయిల్ కాల్స్ పూర్తిగా ఉచితం. డేటా ప్యాక్ రూ.153కే నెల రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా అందుబాటులోకి రానుంది. నెలకు రూ.309తో జియో టీవీ సౌకర్యం కల్పించామని, జియో ఫోన్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉందని వివరించారు. ఎమర్జెన్సీలో లొకేషన్ షేర్ చేసే ఆప్షన్ ఉండటం విశేషం.