సాక్షి, హైదరాబాద్: రెరా లక్ష్యం తప్పుతోంది! నాణ్యత, గడువు, పారదర్శకత, ధర, క్రయ విక్రయాల్లో స్పష్టత, డెవలపర్లు, ఏజెంట్ల వివరాలు.. ఇలా ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉంచాల్సిన రెరా.. అసలు లక్ష్యం దారి తప్పుతోంది. దీంతో కొనుగోలుదారులకు భరోసా కలిగించాల్సిన రెరా అసంతృప్తిని మిగులుస్తోందని కొనుగోలుదారుల సం ఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2017లో నోటిఫై చేసింది. తొలుత నమోదు గడువును 2018 నవంబర్ 30 వరకు విధించింది. కానీ, ఆశించిన స్థాయిలో డెవలపర్ల నుంచి స్పందన లేకపోవటంతో ప్రతి 15 రోజుల కొకసారి గడువు తేదీని పొడిగిస్తుంది. సరైన సమయంలో నమోదు చేసుకోని డెవలపర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోకుండా ఇలా పలుమార్లు గడువును పొడిగించడం సరైంది కాదని.. ఇలా అయితే తెలంగాణలో రెరా అమలు సంతృప్తికరంగా ఉండదని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రెరా ముందు.. తర్వాత!
2017 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 30 మధ్య అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు టీ–రెరాలో నమోదు చేసుకోవాలి. నమోదు చేశాకే ప్రకటనలు, అమ్మకాలు చేయాలి. మరి, 2017 జనవరి 1 కంటే ముందు అనుమతి పొందిన ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఏంటి? ఆయా ప్రాజెక్ట్‌లను అడ్వర్టయిజింగ్ చేస్తే వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు, నంబర్లు, తేదీలు ప్రకటనలో తప్పకుండా ప్రకటించాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్) డిమాండ్ చేసింది. అప్పుడే కొనుగోలుదారులకు ఆ ప్రాజెక్ట్ రెరాకు ముందా? లేక తర్వాతి ప్రాజెక్టా అనేది స్పష్టత వస్తుందని పేర్కొంది.
వసూళ్లకే రెరా..
ప్రస్తుతం టీ– రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు, ప్రమోటర్లు, ఏజెంట్ల ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని, ప్రాజెక్ట్ నిర్మాణ స్థితి గతులు, క్రయ విక్రయాల సంఖ్య, ప్రాజెక్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు, ప్రమోటర్ల ఆదాయ వివరాలు వంటి కీలక సమాచారం ఏదీ కూడా అందుబాటులో లేదని యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్ జనరల్ సెక్రటరీ బీటీ శ్రీనివాసన్ తెలిపారు. టీ–రెరాను జస్ట్ ప్రాజెక్ట్‌ల నమోదుకు మాత్రమే ఉపయోగిస్తున్నట్టుందని పేర్కొన్నారు. నమోదు రుసుములు, జరిమానాలను వసూలు చేసే విభాగంగా రెరా మిగిలిందని ఆరోపించారు.
వివరాలూ అసంపూర్తిగానే..
టీ– రెరాలో ఇప్పటివరకు ఎంత మంది డెవలపర్లు, ఏజెంట్లు నమోదు చేసుకున్నారు? ఎస్క్రో బ్యాంక్ ఖాతా, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వివరాలు ఏవీ కూడా కొనుగోలుదారులకు అందుబాటులో లేవు. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు ప్రతి మూడు నెలలకొకసారి అప్‌డేట్ చేయాలి. ఎన్ని అమ్ముడుపోయాయి? ఇంకా ఎన్ని ఫ్లాట్లు విక్రయానికి ఉన్నాయి? వంటి వివరాలేవీ అప్‌డేట్ చేయట్లేదు. గృహ కొనుగోలుదారులకు ఈ వివరాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టేటస్, ప్రాంతం అభివృద్ధిని అంచనా వేసుకొని కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకుంటారు.్డ
జరిమానా వివరాల్లేవ్!
గడువులోగా ప్రాజెక్ట్‌లను నమోదు చేయని డెవలపర్లకు రూ.2 లక్షలు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎంత మంది డెవలపర్లు జరిమానా కట్టారు? ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలేంటి? వంటి సమాచారమేదీ కూడా టీ–రెరాలో అందుబాటులో లేదు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఫిర్యాదులు, వాటి పత్రాలు, జడ్జిమెంట్ కాపీలు వంటివేవీ వెబ్‌సైట్లలో లేవు. ఈ వివరాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటే ఆయా ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదు అర్హత ఉండి మరీ చేసుకోలేదని.. అయినా అమ్మకాలు చేస్తున్నారని కొనుగోలుదారులకే తెలిసిపోతుందని.. దీంతో ఆయా ప్రాజెక్ట్‌లల్లో కొనుగోలు చేయాలా? వద్దా? అనేది వాళ్లే నిర్ణయించుకునే వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment