చైనా మందుల దిగుమతులకు చెక్
• ఏటా చైనా నుంచి 3 బిలియన్ డాలర్ల దిగుమతులు
• దేశీయంగానే రసాయనాలు, ఏపీఐ తయారీకి సిద్ధం
• ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం
• ఫార్మాక్సిల్ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న ఔషదాలకు త్వరలోనే చెక్ పడనుంది. ‘‘ఫార్ములేషన్లను తయారుచేసే మూల ఔషదాల్లో భారత్ వెనకబాటు మొత్తం ఔషద రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో ఏటా 3-3.2 బిలియన్ డాలర్ల ఔషదాలు, ముడిపదార్థాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది’’ అని ఫార్మాక్సిల్ చైర్మన్, అరబిందో ఫార్మా డెరైక్టర్ ఎం.మదన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ‘ఇండియా ఫార్మా వీక్-2016’ కార్యక్రమం వివరాలను వెల్లడించేందుకు మంగళవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘నిజానికిపుడు చైనా నుంచి దిగుమతవుతున్న టాప్ వంద ఔషదాలు దేశీయంగానే తయారు చేసే సామర్థ్యం భారత్‌కంది. కానీ ఇందుకోసం దేశీ కంపెనీలను బలోపేతం చేసి ఉమ్మడి మౌలిక సదుపాయాలు, ఔషద క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించాం. దేశీయంగా ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించాం. కేంద్రం కూడా సుముఖంగానే ఉంది. వీటి ఏర్పాటుతో పాటు స్థలం, మౌలిక వసతుల కల్పన వంటి వాటిలో సబ్సిడీ ఇవ్వాలని సూచించాం.
ఇది జరిగితే కంపెనీలకు వ్యయం తగ్గి పోటీతత్వం పెరుగుతుంది’’ అని ఆయన వివరించారు. ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుతో దేశీయంగానే రసాయనాలు, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియెంట్లు (ఏపీఐ), అడ్వాన్స్ ఇంటర్మీడియేట్‌లు, ఇంటర్మీడియేట్ల తయారు చేయగలమని చెప్పారాయన. ప్రస్తుతం అమెరికా వంటి దేశాలకు ఫార్మా ఎగుమతులు 16.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఈ ఏడాది ముగిసే నాటికి మరో 10 శాతం వృద్ధిని సాధిస్తామనే నమ్మకముందని చెప్పారాయన.
నవంబర్ 17-23 వరకు ‘ఇండియా ఫార్మా వీక్-2016’..
సీపీహెచ్‌ఎల్, పీ-ఎంఈసీ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 17 నుంచి 23 వరకు వారం రోజుల పాటు ‘ఇండియా ఫార్మా వీక్-2016’ జరగనుంది. ముంబైలోని బీఈసీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ రెండు వేదికల్లో జరగనున్న ఈ ఫార్మా వీక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. దీన్లో 100కు పైగా దేశాల నుంచి 1,300లకు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఫార్మా రంగంలో బిజినెస్ నాలెడ్జ్, లీడర్‌షిప్, నెట్‌వర్కింగ్ వంటి అంశాలపై ప్రదర్శన సాగనుంది. ఈ కార్యక్రమంలో ఫార్మాక్సిల్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవి ఉదయ్ భాస్కర్, సింతొకెమ్ ల్యాబ్స్ ఎండీ జయంత్ ఠాగూర్, ఎకోబ్లిస్ ఎండీ ఏవీపీఎస్ చక్రవర్తి, యూబీఎం ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ పాల్గొన్నారు.