లావా మేక్ ఇన్ ఇండియా ఫోన్.. | lava Make in Idea Phone.. | Sakshi
Sakshi News home page

లావా మేక్ ఇన్ ఇండియా ఫోన్..

Published Thu, Dec 18 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

లావా మేక్ ఇన్ ఇండియా ఫోన్..

లావా మేక్ ఇన్ ఇండియా ఫోన్..

 ‘సాక్షి’ ఇంటర్వ్యూ :
లావా సీఎండీ హరి ఓమ్ రాయ్

 
 మార్చికల్లా తొలి ఉత్పాదన
నోయిడా యూనిట్‌లో అసెంబ్లింగ్
{పోత్సహిస్తే తెలుగు రాష్ట్రంలో ప్లాంట్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ‘మేక్ ఇన్ ఇండియా’ బాట పట్టింది. 2015 మార్చికల్లా లావా మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. నోయిడాలోని రిపేరింగ్ కేంద్రంలో తొలుత మొబైల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తారు. ప్రస్తుతం చైనాలోని షెన్‌జెన్‌లో ఉన్న సొంత ప్లాంటు నుంచి భారత్‌కు లావా, జోలో బ్రాండ్లలో వివిధ మోడళ్లను దిగుమతి చేస్తోంది. 100 శాతం భారత్‌లో తయారైన మొబైల్ రావడానికి నాలుగేళ్లు పడుతుందని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ తెలిపారు. ఐరిస్ ఫ్యూయెల్ 60 మోడల్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంగళవారం ఢిల్లీ వెళ్లిన సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే..
 
తయారీ కేంద్రంగా భారత్..
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిమాణం 1.8 ట్రిలియన్ డాలర్లు. ఇందులో చైనాలో తయారవుతున్న ఎలక్ట్రానిక్స్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు. ఇప్పుడు ైచె నీయులు కార్మికులుగా పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇదే మనకు కలసి వచ్చే అంశం. భారత్‌లోని యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే చాలు. తయారీ రంగంలో ఆస్తులుగా రూపొందుతారు. 10-15 ఏళ్లలో ప్రపంచ ఎలక్ట్రానిక్స్ అవసరాల్లో 40 శాతం మేర ఉత్పత్తి చేయగలిగేంతగా భారత్‌లో అవకాశాలున్నాయి. ఇక్కడ దృష్టి సారించేందుకు కంపెనీలకు సరైన సమయమిది. ఈ విషయంలో భారతీయ కంపెనీగా మేం ముందడుగు వేస్తున్నాం.
 
ఎక్కువ ప్రోత్సాహకాలిస్తే..
ప్రత్యేక మోడల్ మేక్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో మార్చిలో వస్తోంది. ఈ మోడల్‌కు కావాల్సిన కొన్ని విడిభాగాలను దేశంలో తయారు చేస్తాం. ఇక ప్లాంటు విషయానికి వస్తే ఉత్తరాదితోపాటు దక్షిణాది రాష్ట్రాలనూ పరిశీలిస్తున్నాం. ఎక్కువ ప్రోత్సాహకాలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక రాష్ట్రంలో ప్లాంటు పెట్టేందుకు మేం సిద్ధం. ప్రతిపాదిత ప్లాంటుకై మూడేళ్లలో రూ.500 కోట్లు వెచ్చిస్తాం. నెలకు 50 లక్షల మొబైల్ ఫోన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రానుంది. 2018 నాటికి మొబైల్స్‌ను పూర్తిగా భారత్‌లో తయారు చేస్తాం.
 
ఫిబ్రవరిలో ఆన్‌డ్రాయిడ్ వన్..

ఆన్‌డ్రాయిడ్ వన్ ఫోన్ తయారీలోకి లావా కూడా వస్తోంది. మార్కెట్లో ఉన్న వన్ ఫోన్లతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో ఇది రానుంది. లావా ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు పెద్ద ఎత్తున ఫ్రాంచైజీ విధానంలో ఏర్పాటు చేస్తున్నాం. భారత్‌తోపాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, రష్యా, థాయ్‌లాండ్ తదితర  దేశాల్లో నెలకు 30 లక్షల ఫోన్లను విక్రయిస్తున్నాం. థాయ్‌లాండ్‌లో నెలకు సుమారు 4 లక్షల మొబైల్ పీసులు విక్రయిస్తూ రెండో స్థానంలో ఉన్నాం. 2013-14లో లావా ఇంటర్నేషనల్ రూ.2,909 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్ల మార్కును దాటుతాం. భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో లావాకు 8 శాతం వాటా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement