Lava International
-
మనీలాండరింగ్ కేసులో లావా ఎండీ అరెస్టు
మనీ లాండరింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్‌తో పాటు వివో మొబైల్స్ ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అయితే హరి ఓం రాయ్ ప్రమేయంపై నిర్దిష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు. వివో మొబైల్స్ ఇండియా, గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (జీపీఐసీపీఎల్)తో సహా 23 అనుబంధ కంపెనీలకు చెందిన 48 స్థానాల్లో ఈడీ దాడుల నిర్వహించింది. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 3, 2022న ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయిలే జీపీఐసీపీఎల్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అక్రమంగా చైనాకు నిధులు తరలించడమే లక్ష్యంగా భారత్‌లో బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో పన్నులు ఎగవేస్తూ వివో మొబైల్స్ ఇండియా విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో దాదాపు సగం డబ్బును చైనాకు తరలించిందనే ఆరోపణలు వచ్చాయి. -
Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!
భారతీయ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) సిరీస్‌లో నూతన వేరియంట్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్, 128బీజీ స్టేరేజ్ కెపాసిటీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చవకైన రేంజ్లో లభించే ఈ 5జీ ఫోన్ గురించి లావా కంపెనీ గత ఏడాదిలోనే తెలియజేసింది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.11,499కే ఈ ఫోన్‌ను అందిస్తోంది. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్ల్యూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అలాగే అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. (ఇదీ చదవండి: టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!) లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్స్ 90హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ 2.2 గిగాహెడ్జ్ క్లాక్‌స్పీడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ మెమొరీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ 1 టీబీ వరకు పెంచుకునే ఎక్స్టర్నల్ మెమొరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అనానమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ -
లావాకి షాకిచ్చిన సెబీ.. ఐపీవోకు బ్రేక్
న్యూఢిల్లీ: మొబైల్ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కంపెనీ దాఖలు చేసిన ప్రాథమిక దరఖాస్తును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెనక్కి పంపించింది. కొన్ని అంశాలలో తాజా సమాచారాన్ని క్రోడికరించి తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. వెరసి లావా లిస్టింగ్ ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. లావా, జోలో బ్రాండ్లతో మొబైల్ హ్యాండ్ సెట్లు, ట్యాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను లావా ఇంటర్నేషనల్ రూపొందిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా కంపెనీ 2021 సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.37 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను బ్రాండుకు ప్రాచుర్యం, ఇతర సంస్థల కొనుగోళ్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. చదవండి: విమాన ప్రయాణం.. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమంటారు, ఎందుకో తెలుసా? -
లావా మేక్ ఇన్ ఇండియా ఫోన్..
‘సాక్షి’ ఇంటర్వ్యూ : లావా సీఎండీ హరి ఓమ్ రాయ్ మార్చికల్లా తొలి ఉత్పాదన ⇒ నోయిడా యూనిట్లో అసెంబ్లింగ్ ⇒ {పోత్సహిస్తే తెలుగు రాష్ట్రంలో ప్లాంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ‘మేక్ ఇన్ ఇండియా’ బాట పట్టింది. 2015 మార్చికల్లా లావా మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. నోయిడాలోని రిపేరింగ్ కేంద్రంలో తొలుత మొబైల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తారు. ప్రస్తుతం చైనాలోని షెన్జెన్లో ఉన్న సొంత ప్లాంటు నుంచి భారత్‌కు లావా, జోలో బ్రాండ్లలో వివిధ మోడళ్లను దిగుమతి చేస్తోంది. 100 శాతం భారత్‌లో తయారైన మొబైల్ రావడానికి నాలుగేళ్లు పడుతుందని లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ తెలిపారు. ఐరిస్ ఫ్యూయెల్ 60 మోడల్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంగళవారం ఢిల్లీ వెళ్లిన సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. తయారీ కేంద్రంగా భారత్.. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిమాణం 1.8 ట్రిలియన్ డాలర్లు. ఇందులో చైనాలో తయారవుతున్న ఎలక్ట్రానిక్స్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు. ఇప్పుడు ైచె నీయులు కార్మికులుగా పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇదే మనకు కలసి వచ్చే అంశం. భారత్‌లోని యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే చాలు. తయారీ రంగంలో ఆస్తులుగా రూపొందుతారు. 10-15 ఏళ్లలో ప్రపంచ ఎలక్ట్రానిక్స్ అవసరాల్లో 40 శాతం మేర ఉత్పత్తి చేయగలిగేంతగా భారత్‌లో అవకాశాలున్నాయి. ఇక్కడ దృష్టి సారించేందుకు కంపెనీలకు సరైన సమయమిది. ఈ విషయంలో భారతీయ కంపెనీగా మేం ముందడుగు వేస్తున్నాం. ఎక్కువ ప్రోత్సాహకాలిస్తే.. ప్రత్యేక మోడల్ మేక్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో మార్చిలో వస్తోంది. ఈ మోడల్‌కు కావాల్సిన కొన్ని విడిభాగాలను దేశంలో తయారు చేస్తాం. ఇక ప్లాంటు విషయానికి వస్తే ఉత్తరాదితోపాటు దక్షిణాది రాష్ట్రాలనూ పరిశీలిస్తున్నాం. ఎక్కువ ప్రోత్సాహకాలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక రాష్ట్రంలో ప్లాంటు పెట్టేందుకు మేం సిద్ధం. ప్రతిపాదిత ప్లాంటుకై మూడేళ్లలో రూ.500 కోట్లు వెచ్చిస్తాం. నెలకు 50 లక్షల మొబైల్ ఫోన్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రానుంది. 2018 నాటికి మొబైల్స్‌ను పూర్తిగా భారత్‌లో తయారు చేస్తాం. ఫిబ్రవరిలో ఆన్‌డ్రాయిడ్ వన్.. ఆన్‌డ్రాయిడ్ వన్ ఫోన్ తయారీలోకి లావా కూడా వస్తోంది. మార్కెట్లో ఉన్న వన్ ఫోన్లతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో ఇది రానుంది. లావా ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు పెద్ద ఎత్తున ఫ్రాంచైజీ విధానంలో ఏర్పాటు చేస్తున్నాం. భారత్‌తోపాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, రష్యా, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో నెలకు 30 లక్షల ఫోన్లను విక్రయిస్తున్నాం. థాయ్‌లాండ్‌లో నెలకు సుమారు 4 లక్షల మొబైల్ పీసులు విక్రయిస్తూ రెండో స్థానంలో ఉన్నాం. 2013-14లో లావా ఇంటర్నేషనల్ రూ.2,909 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్ల మార్కును దాటుతాం. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో లావాకు 8 శాతం వాటా ఉంది.