షేర్లలో నష్టాలొచ్చాయా..? | losses of in shares! | Sakshi
Sakshi News home page

షేర్లలో నష్టాలొచ్చాయా..?

Published Mon, Apr 11 2016 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

షేర్లలో నష్టాలొచ్చాయా..?

షేర్లలో నష్టాలొచ్చాయా..?

రాజేష్‌కు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడమంటే ఇష్టం. అదో అలవాటుగా కూడా మార్చేసుకున్నాడు.

పన్ను మినహాయింపు పొందవచ్చు
* ఒక ఏడాదిలో నష్టాలు... 8 ఏళ్లలో సర్దుబాటు
* ఏడాది దాటిన హోల్డింగ్స్‌పై లాభానికి పన్నుండదు
* షార్ట్‌టర్మ్ నష్టాలకు మాత్రమే ఈ సర్దుబాటు

రాజేష్‌కు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడమంటే ఇష్టం. అదో అలవాటుగా కూడా మార్చేసుకున్నాడు. అయితే ఈ అలవాటు ఇపుడు ట్రేడింగ్‌కూ విస్తరించింది. రోజూ కొన్ని షేర్ల లాట్లు కొనటం, అమ్మటంతో పాటు డెరివేటివ్స్‌లోకీ (ఫ్యూచర్స్, ఆప్షన్స్) కాలు పెట్టాడు. కాకపోతే ఈ ఏడాది ట్రేడింగ్‌లో మునుపెన్నడూ లేనంత నష్టాలొచ్చాయి. తనకు కలిసిరాలేదని అనుకున్నాడు. బాధపడ్డాడు.

ఇంతలో రాజేష్‌కు తన మిత్రుడు సురేష్ తారసపడ్డాడు. ఏంటలా డల్‌గా ఉన్నావ్? అని అడిగితే విషయం చెప్పాడు రాజేష్. ‘‘సరె! పోయిందెలాగూ పోయింది. మళ్లీ ట్రేడింగ్ చేస్తావు కదా! పన్ను లాభం పొందొచ్చులే’’ అన్నాడు సురేష్. అదెలా? అని రాజేష్ అడగ్గా... ‘‘ఒక ఏడాది ట్రేడింగ్‌లో వచ్చిన నష్టాల్ని ఎనిమిదేళ్లలో ఎప్పుడైనా వచ్చే లాభాల్లో పన్ను సర్దుబాటు చేసుకోవచ్చునని ఐటీ నిబంధనలు చెబుతున్నాయి’’ అని వివరించాడు సురేష్. అదెలాగో ఇపుడు చూద్దాం...
 
ఎంత పన్ను చెల్లించాలి?
ఎవరైనా షేర్లు, బంగారం, రుణపత్రాల వంటి క్యాపిటల్ ఆస్తులు గనక కొన్నా, అమ్మినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎంత పన్ను చెల్లించాలి? అసలు చెల్లించాలా? వద్దా? అనేది ఆయా ఆస్తుల్ని ఎంతకాలం ఉంచుకుంటారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
     
* షేర్ల విషయానికొస్తే ఏడాదిలోపు గనక క్రయ విక్రయాలు జరిపితే స్వల్పకాల క్యాపిటల్ గెయిన్స్, లేదా స్వల్పకాల క్యాపిటల్ లాస్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాదికి మించి ఉంచుకుంటే... ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
     
* రుణ పత్రాలు, బంగారం, ప్రాపర్టీ విషయంలో స్వల్పకాల గెయిన్స్ లేదా లాస్ వ్యవధి మూడేళ్లు. మూడేళ్ల తరవాత లావాదేవీలు జరిపితే... అది లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా లాస్ కిందికి వస్తుంది.
     
* ఆదాయపు పన్ను చట్టం ప్రకారం... ఒక వ్యక్తి తనకు వచ్చిన స్వల్పకాల క్యాపిటల్ లాస్‌ను స్వల్పకాల క్యాపిటల్ గెయిన్స్‌తో గానీ, లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తో గానీ సర్దుబాటు చేసుకోవచ్చు. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ లాస్‌ను మాత్రం లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తోనే సర్దుబాటు చేసుకోవాలి.
     
* ఒక వ్యక్తికి షేర్లలో రూ.5 లక్షల నష్టం వచ్చిందనుకోండి. అందులో ఏడాదిలోపు హోల్డ్ చేసిన షేర్లపై వచ్చిన నష్టమెంత? ఏడాదికి మించి హోల్డ్ చేసిన షేర్లపై వచ్చిన నష్టమెంత? అనేది ముందు విడదీయాలి. స్వల్పకాలంలో వచ్చిన నష్టం రూ.4 లక్షలు, దీర్ఘకాలం ఉంచిన షేర్లపై రూ.1 లక్ష నష్టం వచ్చాయనుకుందాం. అలాగే తనకు షార్ట్‌టర్మ్ లాభం రూ.2 లక్షలు, లాంగ్‌టర్మ్ లాభం రూ.50వేలు వచ్చాయనుకుందాం.
     
* ఈ వ్యవహారంలో దీర్ఘకాల క్యాపిటల్ లాస్‌ను లాభాల్లో సర్దుబాటు చేయజాలరు. ఎందుకంటే దీనిపై పన్నే ఉండదు కాబట్టి. అయితే స్వల్పకాల క్యాపిటల్ లాస్‌ను... స్వల్పకాల గెయిన్స్‌తో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. దీనర్థం... తనకు నికరంగా రూ.2 లక్షల స్వల్పకాల లాస్ మిగులుతుంది. (రూ.4 లక్షల్లోంచి 2 లక్షలు తీసివేస్తే...). ఈ మొత్తాన్ని తదుపరి సంవత్సరాల్లో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది.
 
సకాలంలో పన్ను చెల్లిస్తేనే..!
పన్ను చెల్లింపుదారులు సకాలంలో పన్ను చెల్లించి, రిటర్న్‌లు వేస్తేనే ఈ పన్ను ప్రయోజనాన్ని పొందగలుగుతారని ‘జెన్ మనీ’కి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ వేణుగోపాల్ జాగర్లమూడి తెలియజేశారు. ఈ అంశంలో మరింత లబ్ధి పొందాలని భావిస్తే గనక... డెట్ మ్యూచ్‌వల్ ఫండ్ల వంటి వాటిపై వచ్చే లాభాలను కూడా షేర్లపై వచ్చిన నష్టాలతో సర్దుబాటు చేసుకునే అవకాశముంది.
 
నిపుణుల సూచన ప్రకారం... ఫ్యూచర్స్, ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో నష్టాలను వ్యాపారంలో వచ్చిన నష్టాలుగా భావిస్తారు కనక సదరు వ్యక్తి బిజినెస్ యజమానిగా రిటర్న్ దాఖలు చేయాలి. ‘‘ఈ నష్టాలను ఎనిమిదేళ్లపాటు వచ్చే లాభాలతో సర్దుబాటు చేస్తూ పోవచ్చు. అయితే ఒకరోజులోనే అమ్మటం కొనటం చేసే (ఇంట్రాడే) వారికి ప్రత్యేక నిబంధనలున్నాయి’’ అని ‘టిక్ ఎన్ ట్రేడ్ డాట్‌కామ్’ వ్యవస్థాపకుడు మూర్తి గరిమెళ్ల చెప్పారు.

వీటిలో వచ్చే లాభాలు లేదా నష్టాలను స్పెక్యులేటివ్ వ్యాపారంపై వచ్చినవిగా భావిస్తారు. ఇందులో వచ్చే నష్టాలను ఇలాంటి స్పెక్యులేటివ్ బిజినెస్‌లో వచ్చే లాభాలతో మాత్రమే సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. వీటిని నాలుగేళ్ల పాటు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు.
 - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement