ఎప్పటినుంచో అందరూ ఎదురుచూస్తున్న మహీంద్రా స్కార్పియో ఫేస్లిఫ్ట్ కొత్త ఎడిషన్ వచ్చేస్తోంది. శరన్నవరాత్రుల ప్రారంభం రోజైన సెప్టెంబర్ 25న దీన్ని విడుదల చేయనున్నారు. ఆటోమొబైల్ ప్రేమికులు ఇప్పటినుంచే ఈ వాహనానికి ప్రీబుకింగ్స్ చేసేస్తున్నారు. వాళ్లలో ఇప్పటికే స్కార్పియో వాహనం ఉన్నవాళ్లకు ముందు ప్రాధాన్యం ఇస్తామని డీలర్లు చెబుతున్నారు. భారతీయ ఎస్యూవీ మార్కెట్లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న స్కార్పియో కొత్త మోడల్ ఉత్పాదన ఆగస్టు ఒకటోతేదీ నుంచి మొదలైంది. దీని లాంచింగ్ మొదలుపెట్టడానికి ముందే కనీసం 5వేల వాహనాలు సిద్ధం చేసుకోవాలని మహీంద్రా భావిస్తోంది.
కొత్త మోడల్ స్కార్పియోలో.. ముందు లుక్ చాలా బాగుంటుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. దీంతోపాటు కొత్త హెడ్ ల్యాంపులు, ముందు బంపర్, గ్రిల్ కూడా రూపురేఖలు మారిపోతాయి. మామూలు బల్బులకు బదులు హెచ్ఐడీ/ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు ఉండొచ్చు. అయితే పక్కనుంచి చూస్తే మాత్రం ఇది మామూలు స్కార్పియోలాగే ఉంటుంది. కొత్త స్కార్పియోకు అన్నీ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
కేబిన్లో చాలా మార్పులు ఉండబోతున్నాయి. దీని డాష్బోర్డు, కొత్త స్టీరింగ్ వీల్, రీ డిజైన్ చేసిన ఏసీ వెంట్లు.. వీటన్నింటితో సరికొత్త స్కార్పియో.. ఆటోమొబైల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అయితే ఇంజన్ పరంగా చూసుకుంటే మాత్రం పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. 2.2 లీటర్ల ఎంహాక్ డీజిల్ ఇంజన్ ఉంటుందని చెబుతున్నారు.
స్కార్పియో కొత్తమోడల్ 25న విడుదల
Published Tue, Sep 16 2014 12:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
Advertisement