
షావొమి మేక్ ఇన్ ఇండియా ఫోన్ ఆవిష్కరణ నేడు
వైజాగ్‌లో కార్యక్రమం; పాల్గొంటున్న చంద్రబాబు
హైదరాబాద్: చైనాకు చెందిన షావొమీ కంపెనీ భారత్‌లో తయారు చేసిన తొలి ఫోన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వైజాగ్‌లో ఆవిష్కరించనున్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఏపీ కార్యక్రమం కింద ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నదని హైదరాబాద్‌లో విడుదలైన ఒక పత్రికా ప్రకటన పేర్కొంది. ఈ కార్యక్రమంలోనే షావొమీ కంపెనీ తన భారత విస్తరణ ప్రణాళికలను వెల్లడించనున్నదని సమాచారం. ఈ కార్యక్రమంలో షావొమీ ఇండియా సీఈఓ మను జైన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. షావొమీ వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ కూడా పాల్గొంటారు.
వైజాగ్‌లో షావొమీ హోర్డింగ్
కాగా మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న షావొమీ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం వుందంటూ పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. విశాఖ పట్టణం విమానాశ్రయం వద్ద మేక్ ఇన్ ఇండియా లోగోతో షావోమి కంపెనీ ఒక హోర్డింగ్‌ను ఏర్పాటు చేయడం, ఫేస్‌బుక్‌లో కూడా ఒక పోస్ట్ వెలువడడం దీనిని బలపరుస్తున్నాయని పీటీఐ పేర్కొంది. విశాఖ పట్టణం విమానాశ్రయం అరైవల్స్ దగ్గర ‘గుడ్ మార్నింగ్ వైజాగ్ ! భారత్‌లో ఒక అడుగు ముందుకు వేస్తున్నాం అంటూ షావోమి వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా ఫొటోతో ఉన్న హోర్డింగ్ వెలిసింది. ఇదే హోర్డింగ్ ఫోటోను ఆదివారం ట్విటర్‌లో పోస్ట్ చేసిన హ్యూగో, ‘గుడ్ మార్నింగ్ వైజాగ్, వుయ్ ఆర్ టేకింగ్ ఏ బిగ్ లీప్ ఇన్ ఇండియా’ అంటూ ట్వీట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు చైనా కంపెనీలు ఆసుస్, మోటొరొలా, జియోనిలు భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఇదే బాటలో షావోమి కూడా ప్రయత్నాలు చేస్తోంది.